సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (11:36 IST)

ప్రకాశంలో దడపుట్టిస్తున్న కరోనా... వైరస్ దెబ్బకు వణికిపోతున్న వైజాగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వణుకుపుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ప్రకాశం, వైజాగ్, చిత్తూరు, నెల్లూరు, కృష్ణ, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. 
 
ప్రకాశం జిల్లా కరోనా కేసుల విషయానికి వస్తే.. ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు రోజురోజుకూ దడ పుట్టిస్తున్నాయి. తాజాగా మరో 131 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 1836 కాగా... అత్యధికంగా ఒంగోలులో 27, కందుకూరు 18, పామూరు 12, చీరాలలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
అలాగే, జిల్లాలో ఇప్పటివరకు 30 మంది కరోనా కారణంగా మృతి చెందారు. జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు లక్ష దాటాయి. ఇప్పటివరకు కరోనా నిర్ధారణ కోసం పంపిన శ్యాంపిళ్లు 1,02,992 కాగా.. నెగిటివ్ ఫలితాలు వచ్చినవి 93,311... ఇంకా రిపోర్టులు రావాల్సినవి 7846... జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్నవారు 482... మంగళవారం కరోనా నుంచి కోలుకుని 64 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారు 1249 కాగా... జిల్లాలో ప్రస్తుతం 587 యాక్టివ్ కేసులున్నాయి.
 
అదేవిధంగా, విశాఖపట్టణంలో కరోనా మృత్యు తాండవం చేసింది. కోలుకున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. మృతుల సంఖ్య పెరగడంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 18 కి చేరింది. మంగళవారం ఒక్క రోజే జిల్లాలో కరోనాతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 
 
ఈ నెల 11 నుంచి ఇప్పటివరకు అంటే నాలుగు రోజుల వ్యవధిలో 20 మంది కరోనాతో మృతి చెందారు. మంగళవారం మృతి చెందిన ఆరుగురిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరు జాలారిపేట, అక్కయ్యపాలెం, కైలాసపురం, జ్ఞానాపురం, భీమిలి, అచ్యుతాపురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.