ఫార్మా సిటీలో భారీ పేలుడు - విశాఖలో వరుస ప్రమాదాలు?

fire accident
ఠాగూర్| Last Updated: మంగళవారం, 14 జులై 2020 (08:29 IST)
సముద్రతీర ప్రాంతంగా గుర్తింపు పొందిన విశాఖపట్టణంలో మళ్లీ భారీ పేలుడు సంభవించింది. విశాఖలోని ఓ ఫార్మా కంపెనీలు ఈ పేలుడు జరిగింది. రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఇవి రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలిపోయాయి.

దాదాపు పది కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయంటే ప్రమాద తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనతో విశాఖ వాసులు మళ్లీ వణికిపోయారు. 50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

మంటల తీవ్రతకు ఫార్మా సిటీకి సమీపంలోని హెచ్‌టీ విద్యుత్ లైన్లు కూడా తెగి కిందపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా నల్లని పొగలు దట్టంగా కమ్ముకున్నాయి.

ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడడం మినహా ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే విశాఖ, అనకాపల్లి నుంచి 12 భారీ అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

అయితే, మంటల వేడికి కంపెనీ వద్దకు చేరుకునేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో నలుగురు మాత్రమే పనిచేస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని మల్లేశ్వరరావుగా గుర్తించారు. ఈయనతో పాటు.. ఆ కంపెనీలో ఉన్న ముగ్గురిని సురక్షితంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

భారీ ఎత్తున రసాయనాలను నిల్వ చేయడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పరిశ్రమ ఆవరణలో ఉన్న ఐదు రియాక్టర్లలో ఒకదానిలో పేలుడు సంభవించినట్టు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు.దీనిపై మరింత చదవండి :