ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (17:23 IST)

వుహాన్ నగరంలో మళ్లీ కరోనా కేసులు.. జడుసుకుంటున్న చైనా

చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ పుట్టింది. ఈ వైరస్ ప్రభావం ఇప్పటికిప్పుడు తగ్గిందనుకుంటే.. మళ్లీ చైనాకు చుక్కలు చూపిస్తోంది. కరోనా వైరస్ మొదట కనిపించిన వూహన్‌లోనే ఈ కొత్త కేసులు నమోదయ్యాయి. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించేందుకు చైనా జనవరి నుంచి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టాయి. 
 
అయితే విదేశాల నుంచి చైనాకు వస్తున్నవారి వల్ల మళ్ళీ రెండోసారి ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని చైనా అధికారులు భయపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి మొదట్లో ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపించకపోవడం వల్ల, గుర్తించడం కష్టమని చెప్తున్నారు.
 
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 46 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీరిలో 42 మంది విదేశాల నుంచి వచ్చినవారే. గురువారం నమోదైన కొత్త కేసులు 42. హుబే ప్రావిన్స్‌లో వరుసగా ఏడో రోజు కొత్త కేసులు నమోదు కాలేదు.
 
కోవిడ్-19 రోగుల కోసం వూహన్‌లో ఏర్పాటు చేసిన లీషెన్షన్ హాస్పిటల్ ప్రెసిడెంట్ వాంగ్ జింఘువాన్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈ వైరస్ సోకిన లక్షణాలు పైకి కనిపించకపోతే, అటువంటి ప్రయాణికుల వల్ల రెండోసారి వైరస్ విజృంభణ జరిగే అవకాశం లేదని చెప్పలేమన్నారు.