అమెరికా మేయర్‌ను ఇరికించిన ఎన్నారై...
విదేశాల్లో రెస్టారెంట్ పెట్టాడు. అది బాగానే జరుగుతోంది. మంచి పేరు కూడా ఉంది. కానీ మరింత డబ్బు సంపాదించడం కోసం మరో శాఖ పెట్టాలనుకున్నాడు. అదీ న్యూయార్క్ ప్రభుత్వ భూముల్లో. చివరికి ఓ మంత్రిని ఇరికించాడు. ఇది ఓ ప్రవాస భారతీయుడి ఘనకార్యం. బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ స్థలాల కోసం ఆ ప్రాంత మేయర్‌ని వాడుకున్నాడు.
న్యూయార్క్‌లో హరేంద్ర సింగ్ అనే ప్రవాస భారతీయుడు ప్రముఖ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మరో బ్రాంచ్ పెట్టాలనే ఉద్దేశంతో బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నించాడు. ప్రభుత్వ భూముల్లో కొత్త రెస్టారెంట్‌ని నిర్మించాలనుకున్నాడు. ఇందుకోసం ఆ ప్రాంత మేయర్ ఎడ్వర్డ్ మేంగనోకు లంచాలు ఇచ్చాడు. దానికి ఎడ్వర్డ్ కూడా సై అన్నాడు. అడిగిందే తడువుగా అనుమతులు ఇచ్చిపారేశాడు.
బ్యాంక్ ఇచ్చే రుణాలకు ప్రభుత్వం హామీ ఉంటుందని చెప్పి రూ.కోట్లకు కోట్లు రుణాలు ఇప్పించాడు. ఈ తతంగమంతా ఇద్దరూ కలిసే చేశారు. ఎడ్వర్డ్ భార్య హరేంద్ర సింగ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారని చూపించారు. ఈ పొరపాటు ఎడ్వర్డ్ మెడకు ఉచ్చులా బిగుసుకుంది. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం కొనసాగించడం చూసి ప్రభుత్వం దర్యాప్తు చేసింది. హరేంద్ర సింగ్‌ని విచారణ జరిపింది. అతను అప్రూవల్‌గా మారి విషయం మొత్తం బయటపెట్టాడు. ఇప్పుడు ఆ కేసు రుజువైతే ఆ మంత్రికి, అతని భార్యకి కనీసం 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.