పాక్‌లో హిందూ విద్యార్థిని మృతి.. కరాచీ వీధుల్లో భగ్గుమన్న నిరసనలు
పాకిస్థాన్ దేశంలో ఓ హిందూ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. దీంతో ఆ దేశంలో పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు కరాచీ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు.
పాక్‌లోని లర్ఖానా ప్రాంతానికి చెందిన నమ్రితా చందాని అనే యువతి వైద్య విద్యను అభ్యసిస్తూ ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయింది. లర్ఖానాలోని బబీ అసిఫా దంత వైద్య కాలేజీలోని తన హాస్టల్ గదిలో నమ్రితా విగతజీవిగా కనిపించింది. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టడంతో అనుమానాస్పదంగా తేలింది.
మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని బాధితురాలి సోదరుడు డాక్టర్ విశాల్ సుందర్ ఆరోపిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులు పెరిగిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతితో పాక్‌లో నిరసనలు భగ్గుమన్నాయి.