బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (15:49 IST)

భారతీయుడిగానే చనిపోవాలంటున్న పాక్ పౌరుడు

పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన పౌరుడు ఒకడు భారతీయుడిగానే చనిపోవాలని ఆశపడుతున్నారు. కానీ, భారత ప్రభుత్వ అధికారులు మాత్రం దానికి అడ్డు చెపుతున్నారు. అసలు పాక్ పౌరుడేంటి.. భారతీయుడిగా ఎందుకు చనిపోవాలని భావిస

పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన పౌరుడు ఒకడు భారతీయుడిగానే చనిపోవాలని ఆశపడుతున్నారు. కానీ, భారత ప్రభుత్వ అధికారులు మాత్రం దానికి అడ్డు చెపుతున్నారు. అసలు పాక్ పౌరుడేంటి.. భారతీయుడిగా ఎందుకు చనిపోవాలని భావిస్తున్నాడు అనే విషయాన్ని పరిశీలిస్తే, 
 
అది 1946 సంవత్సరం. భారత్ రెండుగా విడిపోలేదు. ఆ సమయంలో నందకిశోర్ అనే వ్యక్తి యూపీలోని దేవరియా ప్రాంతంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు‌. కుటుంబ పోషణార్థం నందకిశోర్‌ను అతని తల్లి ఓ ఇంట్లో పని కోసం కరాచీ (కరాచీ అప్పటికీ భారత్‌లోనే ఉంది) పంపించారు. అప్పుడు నందకిశోర్‌ వయసు 8 ఏళ్లు. నందకిశోర్‌ వెళ్లిన యేడాదికి భారత్‌, పాక్‌ విడిపోయాయి.
 
అపుడు నందకిశోర్‌‌ను పనికి కుదుర్చుకున్న యజమాని.. కరాచీలో ఉన్నప్పుడే అతని పేరును హస్మత్‌ అలీగా మార్చారు. అటు తర్వాత హస్మత్‌ అలీ అక్కడే పౌరసత్వం పొందారు. కొన్నేళ్ల తర్వాత పాక్ పాస్‌పోర్టుతో, హస్మత్‌ పేరుతో నందకిశోర్‌ భారత్‌కు తిరిగొచ్చాడు. 
 
ఆ తర్వాత 1974 నుంచి 1998 మధ్య హస్మత్‌ అలీ వీసా గడువును సంవత్సరానికొకసారి పొడిగించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే నందికిశోర్ పెళ్లి కూడా చేసుకున్నారు. 1998 తర్వాత నందికిశోర్ వీసా గడువు పొడిగించేందుకు కేంద్రం నిరాకరించింది. ఇక వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 
 
అయినప్పటికీ ఆయన పురిటిగడ్డను వీడలేదు. ఇప్పటికే పలుసార్లు కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ నందకిశోర్‌ మాత్రం తనకు పాక్‌ వెళ్లడం ఇష్టం లేదని.. ఓ భారతీయుడిగానే చనిపోవాలని కోరుకుంటున్నట్లు తెగేసి చెప్తున్నాడు. మరి నందికిశోర్ అలియాస్ హస్మత్ అలీపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం ఈయన వయసు 80 యేళ్లు. ఉత్తరాఖండ్‌‌లోని నారాయణ్ పూర్ గ్రామంలో ఉంటున్నారు.