భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ నిర్వహించిన దాడుల్లో తమ యుద్ధ విమానం ఒకటి దెబ్బతిందని పాకిస్థాన్ వెల్లడించింది. పైగా, భారత్ యుద్ధ విమానాలు చేసిన దాడుల వల్ల తాము నష్టపోయినట్టు పేర్కొంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చివేసి, భారీ నష్టం కలిగించామని భారత్ వైమానిక వర్గాలు గతంలో ప్రకటించాయి. ఇపుడు ఈ వార్తలను నిర్ధారిస్తూ పాకిస్థాన్ ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
ఇస్లామాబాద్‌లో తమ దేశ వాయుసేన, నౌకాదళ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో పాకిసథాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశంతో చోటుచేసుకున్న సైనిక ఘర్షణల సమయంలో మన వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం స్వల్పస్థాయిలో ధ్వంసం కావడం నిజమే అని ఆయన వెల్లడించారు. అయితే, ఆ విమానానికి వాటిల్లి నష్టం ఏ స్థాయిలో ఉంది, దానికి సంబంధించిన ఇతర పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. కేవలం స్వల్ప నష్టంగానే ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం.
భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యకు పాకిస్థాన్ కకావికలమైపోయింది. భారత మిస్సైళ్ల దాడికి పాకిస్థాన్ ప్రధాన వైమానిక స్థావరాలు ధ్వంసం కావడంతో అపారనష్టం వాటిల్లింది. ముఖ్యంగా, రావల్పిండిలో పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ మేరకు పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా తాజాగా విడుదల చేసిన శాటిలైట్ ఫోటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యకు దిగిన విషయంతెల్సిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ సాయుధ బలగాలు దాడులు చేశాయి. అయితే, ఈ దాడులను జీర్ణించుకోలేని పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగింది. దీంతో భారత్ మరింత రెచ్చిపోయి, పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఆ దేశ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు గణనీయమైన నష్టం వాటిల్లింది.
రావల్పిండిలోని ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్థాన్ సైన్యానికి అత్యంత కీలకమైన, వ్యూహాత్మక వైమానిక స్థావరంగా ఉంది. భారత్ తన సైనిక సామర్థాయన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే పాక్‌లోని వైమానిక స్థావరంపై దాడి చేసిందని అంతర్జాతీయ యుద్ధ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని రన్‌వే ధ్వంసమైనట్టు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను చైనా తాజాగా విడుదల చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.