కారులో ఉన్న న్యూస్ యాంకర్ కాల్చివేత... ఎక్కడ?
కారులో కూర్చొనివున్న ఓ న్యూస్ యాంకర్‌ను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణం పాకిస్థాన్ దేశంలోని కరాచీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్, కరాచీలోని ఓ కేఫ్‌లో బోల్ న్యూస్ అనే చానల్‌లో మురీద్ అబ్బాస్ న్యూస్ యాంకర్ తన కారులో స్నేహితుడితో కలిసి కూర్చొనివున్నాడు. అపుడు అబ్బాస్‌పై అతీఫ్ జమాన్ అనే వ్యక్తి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.
తీవ్రంగా గాయపడిన అబ్బాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన అబ్బాస్ స్నేహితుడు ఖిజార్ హయత్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా, కాల్పుల అనంతరం ఆత్మహత్యకు యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. చాతీలో కాల్చుకోవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.