బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శనివారం, 6 జులై 2019 (17:49 IST)

మాలిక్‌కు ఫేర్‌వెల్ మ్యాచ్ అవసరం లేదు.. మంచి డిన్నర్ ఇస్తే చాలు (video)

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్, సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ చివరి మ్యాచ్ ఆడకుండానే.. రిటైర్మెంట్ ప్రకటించడంపై ఆయన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  తన కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌తో ఆడుదామనుకున్న మాలిక్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ షోయబ్ మాలిక్ ఫేర్ వెల్ మ్యాచ్‌పై స్పందించాడు. 
 
షోయబ్‌ మాలిక్‌కు ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ అవసరం లేదని వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్‌కు మాలిక్ సేవలు అమోఘమని కితాబిచ్చాడు. కానీ రిటైరయ్యే ప్రతి ఆటగాడికీ ఫేర్ వెల్ మ్యాచ్ ఇచ్చేందుకు ఇది క్లబ్ క్రికెట్ కాదన్నాడు. అతనికి ఓ మంచి డిన్నర్ ఇస్తే చాలునని అక్రమ్ వ్యాఖ్యానించాడు. 
 
ఇకపోతే.. 1999లో వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడిన మాలిక్‌.. చివరి వన్డే టీమిండియాపై ఆడాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 89 పరుగుల (డక్‌వర్త్‌లూయిస్‌) తేడాతో ఓడిపోయింది. మాలిక్‌ ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.
 
20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 143. ఇందులో తొమ్మిది సెంచరీలు, 44 అర్థ సెంచరీలు చేశాడు. ఇక 39.19 సగటుతో 158 వికెట్లు కూడా పడగొట్టాడు. 2010లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. మాలిక్, సానియాలకు ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. 20 ఏళ్లపాటు పాక్‌ క్రికెట్‌కు సేవలందించిన మాలిక్‌కు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం శుభాకాంక్షలు తెలుపుతోంది. మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
 
భర్త రిటైర్మెంట్‌పై ఆయన భార్య సానియా మీర్జా కూడా ట్విట్టర్లో స్పందించింది. ''మాలిక్‌ 20 ఏళ్లు నీ దేశం గర్వించేలా ఆడావు. అలాగే ఎంతో గౌరవం, వినయంతో నీ ఆటను కొనసాగించావు. నీవు సాధించిన ప్రతి మైలురాయి పట్ల నేనెంతో గర్వపడ్డా." అని సానియా మీర్జా ట్వీట్‌ చేసింది.