చివరి మ్యాచ్ ఆడకుండానే సానియా భర్త.. రిటైర్మెంట్ ప్రకటించేశాడు..
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ శుక్రవారం అంతర్జాతీయ వన్డేలకు స్వస్తి చెప్పాడు. శుక్రవారం ఈ మేరకు అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ అంశాన్ని అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. అయితే మాలిక్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ (చివరి మ్యాచ్) ఆడకుండానే వన్డేల నుంచి తప్పుకున్నాడు.
అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని.. తనతో ఆడిన ఆటగాళ్లకు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా, స్పాన్సరర్స్‌కు ధన్యవాదాలు.
ముఖ్యంగా తన అభిమానులకు కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్ అని ట్వీట్ చేశాడు. ఇకపోతే.. మాలిక్‌కు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇస్తున్న వీడియోను క్రికెట్ ప్రపంచకప్ తన అధికారిక ట్విట్టర్ కూడా షేర్ చేసింది.
ఇకపోతే.. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాడిగా కొనసాగిన షోయబ్ మాలిక్ ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో ఘోరంగా విఫలమై జట్టులోనే చోటు కోల్పోయాడు.
ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన మాలిక్.. 8, 0, 0 పరుగులు చేశాడు. దీంతో అతన్ని పక్కనపెట్టేశారు. ఒక మ్యాచ్‌లో అయితే వికెట్లను బ్యాట్‌తో కొట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు బైబై చెప్పేశాడు.