కశ్మీర్ అంతర్జాతీయ వివాదమన్న పాక్ ప్రధాని ఇమ్రాన్... అమిత్ షా అణుబాంబు వేశారన్న ఆజాద్
జమ్ము-కశ్మీర్ పైన హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయంపైన పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కశ్మీర్ అనేది అంతర్జాతీయ సమస్య అనీ, దీనిపై ఇండియా తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. రాజకీయంగానూ, దౌత్యపరంగా తాము ముందడుగు వేసేందుకు అనువైన మార్గాలను చూస్తున్నట్లు తెలిపారు.
కశ్మీర్ అంతర్జాతీయ వివాదంలో తాము కూడా భాగస్వాములుగా వున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు కశ్మీరీల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీరీలు, పాకిస్థానీయులు ఆమోదించరంటూ తెలిపింది.
కశ్మీర్ పైన అమిత్ షా అణుబాంబు వేశారన్న ఆజాద్
కాశ్మీర్‌లో ముగ్గురు ప్రముఖ రాజకీయనేతలను గృహ నిర్బంధంలో ఉంచడం, శ్రీనగర్‌లో 144 సెక్షన్ అమల్లోకి తేవడంతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. కాశ్మీర్ పైన అమిత్ షా అణుబాంబు వేశారనీ, అసలు ఆ ప్రాంతాన్ని ఏంచేయదలచుకున్నారు? అని ప్రశ్నించారు.
సోమవారంనాడు పార్లమెంటు వద్ద ఆజాద్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. పార్లమెంటులో కాశ్మీర్ అంశాన్ని తమ పార్టీ ఇవాళ లేవెనత్తుతుందని, ప్రధాని మోదీ నుంచి వివరణ కోరుతామని చెప్పారు.
కాగా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. 35ఎ కూడా రద్దుకు కూడా అమిత్ షా ప్రకటన చేశారు. 370 రద్దుతో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోనుంది. 35ఏ రద్దుతో కాశ్మీర్ ప్రత్యేక సౌకర్యాలను కోల్పోనుంది.