1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (13:18 IST)

పంజాబ్ ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

victim
ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. వారిపై జరిగే అత్యాచారాలు, నేరాలు ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో ఏ ఒక్క దేశం మినహాయింపులేకుండా పోయింది. అయితే, పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌‍లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవడంతో వీటి అడ్డుకట్ట కోసం ఏకంగా ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
మహిళపై జరుగుతున్న అత్యాచారాలను కట్టిడి చేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చిందని ఆ ప్రావిన్స్ హోం మంతరి అత్తా తరార్ వెల్లడించారంటే అక్కడ పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, 'ప్రతి రోజూ కనీసం నాలుగైదు అత్యాచార కేసులు వెలుగు చూస్తున్నాయి. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, బలవంతపు చర్యలు గురించి ఇక చెప్పనక్కర్లేదు. అందుకే ఎమర్జెన్సీని విధించినట్టు తెలిపారు. పైగా, లైంగిక వేధింపులు, బలవంతపు చర్యలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తుంది' అని వివరించారు. 
 
అత్యాచారాలు, శాంతిభద్రతల పరిస్థితులను రాష్ట్ర కేబినెట్ కమిటీ సమీక్షిస్తుందని చెప్పారు. ఈ ఘటనలను నియంత్రించేందుకు టీచర్లు, అటార్నీలు, మహిళా హక్కుల సంస్థలతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. 
 
భద్రత గురించి తమ పిల్లలకు తెలియజెప్పాలని మంత్రి తరార్ సూచించారు. యువతులను ఇంట్లో ఒంటరిగా విడిచి వెళ్లొద్దని సూచించారు. అత్యాచార వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, స్కూళ్లలో అత్యాచార వేధింపులపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.