సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (13:18 IST)

'జోడో' యాత్రలో రాహుల్ పెళ్లి ప్రస్తావన.. రియాక్షన్ ఎంటో తెలుసా?

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు వీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ "భారత్ జోడో యాత్ర"ను ప్రారంభించారు. ఈ యాత్రం తమిళనాడు నుంచి జమ్మూకాశ్మీర్ వరకు కొనసాగనుంది. ఇప్పటికే తమిళనాడులో యాత్ర పూర్తికాగా, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది.
 
అయితే, ఈ యాత్రలో శనివారం ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్‌ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. 'మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని  ఓ మహిళ రాహుల్‌ గాంధీతో అన్నారు. 
 
ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. వారితో మాట్లాడుతున్న సమయంలో రాహుల్‌ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.
 
శనివారం సాయంత్రం యాత్ర కేరళలోకి ప్రవేశించింది. సరిహద్దులో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికారు. కేరళలో 18 రోజుల పాటు కార్యక్రమం ఉంటుందని నేతలు తెలిపారు.