శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (19:12 IST)

బ్రిటన్ ప్రధాని పీఠంపై భారత సంతతి పౌరుడు... రిషి సునక్!

Rishi Sunak
బ్రిటన్ ప్రధాని పీఠాన్ని భారత సంతతి పౌరుడు తొలిసారి అధిరోహించనున్నారు. బ్రిటన్ ప్రధానిగా అనూహ్యంగా రిషి సునక్ ఎంపికయ్యారు. ఆయన ఈ నెల 28వ తేదీన బ్రిటన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎంపికై లిజ్ ట్రస్ కేవలం 48 రోజుల్లోనే తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె సారథ్యంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో పాటు సంపన్నులపై పన్ను కోతలు విధించడంతో దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకోవాల్సిన నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాను మళ్లీ బరిలో నిలుస్తున్నట్టు ఆ దేశ ఆర్థిక మాజీ మంత్రి అయిన రిషి సునక్ ప్రకటించారు. ఆయనకు దాదావు 193 మంది ఎంపీలు అండగా నిలిచారు. దీంతో ఆయన బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన అన్ని పిన్నవయస్కుడి (42 యేళ్ళు) నిలిచారు. అంతేకాదు తొలిసారి భారత సంతతికి చెందిన నాయకుడు బ్రిటన్ దేశానికి సారథ్యం వహిస్తుండటం గమనార్హం. ఇదో సరికొత్త రికార్డు కానుంది. 
 
నిజానికి లిజ్ ట్రస్ తర్వాత బ్రిటన్ ప్రధాని కోసం చేపట్టిన చర్యల్లోభాగంగా, రిషి సునక్‌కు ప్రత్యర్థిగా పెన్నీ మోర్డాంట్ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ఆమె కనీసం 100 మంది ఎంపీల మద్దతును కూడగట్టలేక పోయారు. దీంతో ఆమె ప్రధాని రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
 
అలాగే, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కూడా ప్రధాని పీఠానికి పోటీ చేయాలని భావించినప్పటికీ అధికార కన్జర్వేటవ్ పార్టీ ఎంపీల మద్దతును కూడగట్టలేక పోయారు. ఆయనకు కేవలం 58 మంది ఎంపీలు మాత్రమే మద్దతు తెలిపారు. పైగా, పార్టీలో ఐక్యత కోసం తాను ప్రధాని పదవి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. 
 
దీంతో రిషి సునక్ ఎన్నిక దాదాపుగా ఖాయమైంది. అన్ని లాంఛనాలు సక్రమంగా పూర్తయితే ఈ నెల 28వ తేదీన బ్రిటన్ దేశ ప్రధాని పగ్గాలను రిషి సునక్ చేపట్టనున్నారు. ఈయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు కావడం గమనార్హం.