ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (22:46 IST)

లిజ్ ట్రస్ కొంప ముంచిన పన్నుల కోత.. అందరి కళ్లూ రిషి సునక్ పైనే...

rishi sunak
బ్రిటన్ పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని లిజ్ ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ ఆమె కొంప ముంచింది. ఈ పన్నుల కోత బెడిసి కొట్టడంతో ఆమె తన ప్రధాని పదవిని కోల్పోయారు. దీంతో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరా? అని సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. పైగా, ప్రతి ఒక్కరి కళ్లూ భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. 
 
కాగా, 45 రోజుల క్రితం బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పన్నుల కోత ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇది బెడిసి కొట్టింది. ఆర్థిక సంక్షోభం దిశగా దేశం పయనించింది. ఇప్పటికే అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో ఆర్థిక మంత్రి పదవి నుంచి క్వాసీ కార్టెంగ్‌ను తప్పించారు. ఆ తర్వాత మరికొందరు మంత్రులు  కాడ రాజీనామా చేశారు. మంత్రులందరూ ఒక్కొక్కరుగా రాజీనామాలు చేయడంతో లిజ్ ట్రస్‌ కూడా తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. 
 
ప్రస్తుతం బ్రిటన్‌లో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఆర్థిక మంత్రిగా పేరుగడించిన రిషి సునక్ అయితే, దేశాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరని ఆ దేశ పార్లమెంటేరియన్లతో పాటు ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం ఎన్నికలంటూ జరిగితే ఖచ్చితంగా రిషి సునక్ సునాయాసంగా గెలుపొందుతారనే టాక్ బలంగా వినిపిస్తుంది.