ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (09:53 IST)

రష్యా కరోనా వ్యాక్సిన్‌లో మళ్లీ అపశృతి.. కండరాల నొప్పులు.. జ్వరం..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు రష్యాతో పాటు.. అనేక ప్రపంచ దేశాలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, రష్యా ఓ వ్యాక్సిన్ తయారు చేసింది. దీనికి స్పుత్నిక్ వి అనే పేరు పెట్టింది. అయితే, ఈ వ్యాక్సిన్ ప్రయోగాల్లో అపశృతి దొర్లింది.
 
మనుషులపై చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా, ఇటీవల ఓ వలంటీర్ అస్వస్థతకు గురికాగా, మూడోదశ పరీక్షల్లోనూ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురష్కో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 
 
వ్యాక్సిన్‌కు జరుగుతున్న తుది పరీక్షల్లో భాగంగా మొత్తం 40 వేల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 300 మందికి టీకా వేసినట్టు చెప్పారు. 
 
అయితే, టీకా తీసుకున్న ప్రతి ఏడుగురు వలంటీర్లలో ఒకరిలో కండరాల నొప్పి, జ్వరం, నీరసం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. అయితే, భయపడాల్సింది ఏమీ లేదని, ఒక రోజు, లేదంటే 36 గంటల తర్వాత ఈ లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని మంత్రి వివరించారు.
 
ఇదిలావుంటే, ప్రపంచంలో మొదటి కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన ఆ దేశం ఇప్పుడు ఫార్మసీలో అమ్మేందుకుగానూ మొట్టమొదటి ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్‌ను ఆమోదించింది. ‘కరోనావిర్‌’గా పిలిచే ఈ ఔషధాన్ని రష్యాకు చెందిన ఆర్‌-ఫార్మ్‌ అభివృద్ధి చేసింది. 
 
దీనిని స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న కొవిడ్‌ రోగులకు చికిత్సలో భాగంగా అందించనున్నారు. ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వారంలోగా దేశంలోని అన్ని ఫార్మసీలకు పంపిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. 168 మంది రోగులు పాల్గొన్న మూడోదశ క్లినికల్ ట్రయల్స్ తర్వాత కరోనావిర్‌కు అనుమతి లభించిందని ఆర్-ఫార్మ్ తెలిపింది.
 
కరోనావిర్ ఆమోదం అవిఫావిర్‌ అనే డ్రగ్‌కు మార్గం సుగమమం చేసింది. ఈ రెండు ఔషధాలను జపాన్‌లో అభివృద్ధిచేసిన ఫావిపిరవిర్‌ డ్రగ్‌ ఆధారంగా తయారుచేశారు. అలాగే, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సరఫరా కోసం అనేక అంతర్జాతీయ ఒప్పందాలను కుదుర్చుకుంది.