ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:25 IST)

ముసుగులు నిషేధించిన శ్రీలంక... బుర్ఖాలు కూడానా?

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 350 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయి, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు శ్రీలంకలో మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ భద్రతను కట్టుదిట్టం చేసాయి.
 
ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉండటంతో సోమవారం నుంచి అత్యయిక పరిస్థితి చట్టాన్ని వినియోగిస్తూ చాలా నిబంధనలను విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు.
 
ఈ నిబంధనల్లో భాగంగా దేశ ప్రజలు ఎవరైనా తమ ముఖాన్ని ఇతరులు గుర్తు పట్టకుండా ఉండేట్లు ఎటువంటి ముసుగు ధరించకూడదని అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకుండానే అన్ని రకాల ముసుగులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీలంక జనాభాలో దాదాపు 10 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 
 
భద్రతా కారణాల దృష్ట్యా దేశంలోని ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించకూడదని వారం రోజుల క్రితం శ్రీలంకకు చెందిన ఓ ఎంపీ కూడా ప్రతిపాదించారు. ముఖాన్ని కప్పుతూ ఉండేలా దుస్తులు ధరించవద్దని ఇటీవల శ్రీలంకలోని ఓ ముస్లిం సంస్థ కూడా సూచించింది. 
 
ఎనిమిది రోజులుగా శ్రీలంకలో హై అలర్ట్ కొనసాగుతోంది. పదుల సంఖ్యలో అనుమానితులను అరెస్టు చేశారు. మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ నిఘా సంస్థల హెచ్చరికలు చేస్తుండడంతో శ్రీలంక ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.