శ్రీలంకలో గత ఈస్టర్ ఆదివారం నాడు జరిగిన బాంబు దాడులకు సంబంధించిన ముందస్తు నిఘా హెచ్చరికల గురించి తనకు తెలియదని లంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే బీబీసీతో చెప్పారు. దేశంలో పొంచివున్న ప్రమాదం గురించిన కీలక సమాచారం తనకు అందించలేదని ఆయన పేర్కొన్నారు. దాదాపు 250 మంది ప్రాణాలను బలిగొన్న ఈస్టర్ ఆదివారం నాటి బాంబుదాడుల విషయంలో శ్రీలంకలో భారీ నిఘా వైఫల్యం బట్టబయలైంది.
ఈ నేపథ్యంలో శ్రీలంక పోలీస్ చీఫ్‌తో పాటు రక్షణ మంత్రిత్వశాఖ అత్యున్నత అధికారి కూడా రాజీనామా చేశారు. అయితే.. ఈ దాడులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు తనకు అందలేదని చెప్పటం ద్వారా.. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని విక్రమసింఘే వాదించారు.
‘ఏమీ చెప్పకపోతే ఏం చేయగలం?’
''మాకు ఏదైనా సూచన తెలిసినట్లయితే.. మేం చర్యలు చేపట్టకపోయినట్లయితే.. నేను తక్షణమే నా రాజీనామా చేసి ఉండేవాడిని. కానీ మనకు ఏమీ చెప్పకపోతే మనమేం చేస్తాం?'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమాచార లోపం.. దేశంలో అత్యంత శక్తివంతమైన ఇద్దరు వ్యక్తులు.. ప్రధాని విక్రమసింఘే, అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనల మధ్య నెలకొన్న అంతర్గత పోరు మీద మళ్లీ దృష్టి కేంద్రీకరించేలా చేస్తోంది.
గత ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరి మధ్య సంబంధాలు.. విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి అధ్యక్షుడు సిరిసేన తొలగించేంతగా క్షీణించాయి. అయితే డిసెంబర్‌లో శ్రీలంక ఉన్నతస్థాయి న్యాయస్థానాల ఆదేశాలతో ఆయనను తిరిగి ప్రధానిగా నియమించారు. ఇదిలావుంటే.. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపుతో సంబంధం ఉన్న అనుమానితులు దాదాపు 130 మంది దేశంలో ఉన్నట్లు శ్రీలంక నిఘా సంస్థ భావిస్తోందని అధ్యక్షుడు సిరిసేన విలేకరులతో పేర్కొన్నారు. ఇంకా పరారీలో ఉన్న 70 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన చెప్పారు.
‘ఆత్మాహుతి బాంబర్ల ఆశ్రయం గుర్తించాం’
శ్రీలంక తూర్పున ఉన్న సామ్మాన్‌తురై నగరంలో పోలీసులు జరిపిన సోదాల్లో.. బాంబు దాడులకు పాల్పడిన వారు తలదాచుకున్న ఇంటిని గుర్తించినట్లు చెప్తున్నారు. ''ఇస్లామిక్ స్టేట్ బ్యానర్, ఆత్మాహుతి బాంబర్లుగా చెప్తున్న వారు విడుదల చేసిన వీడియోలో ఉన్నట్లుగా ఉన్న ఐఎస్ యూనిఫాంను అక్కడ స్వాధీనం చేసుకున్నాం'' అని పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు. ఆ సోదాల్లో 150 డైనమైట్ స్టిక్‌లు, ఒక లక్ష బాల్ బేరింగ్‌లు కూడా దొరికాయని చెప్పారు.
మరో ప్రాంతంలో భద్రతా బలగాలకు, అనుమానితుల బృందానికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. ఈ దాడులు చేసింది తామేనని ఐఎస్ చెప్పినప్పటికీ.. ఇది నేషనల్ తావ్‌హీద్ జమాత్ అనే స్థానిక ఇస్లామిక్ అతివాద బృందం పని అని లంక అధికారులు ఆరోపించారు.
మృతుల సంఖ్య 253 మంది...
మరోవైపు బాంబు దాడుల్లో చనిపోయిన వారి సంఖ్యను లంక అధికారులు సవరించి 100కు పైగా తగ్గించారు. మృతుల సంఖ్య 359 మంది అని తొలుత చెప్పిన అధికారులు తాజాగా ఆ సంఖ్యను 253 మందికి తగ్గించారు. బాంబు దాడులు జరిగిన ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలను గుర్తించటం కష్టం అవటం వల్ల లెక్కలో పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. అయితే.. తొలుత వేసిన అంచనాలో అంత పొరపాటు ఎలా జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో చర్చి ప్రార్థనలన్నిటినీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు క్యాథలిక్ చర్చి ప్రకటించింది. ఇంకోవైపు.. నెగాంబోలో పాకిస్తాన్‌కు చెందిన అహ్మదీ ముస్లింలు కొందరిని, కొందరు క్రైస్తవులను, ఇంకొందరు అఫ్ఘాన్ జాతీయులను వారి ఇళ్ల యజమానులు ఉన్నపళంగా ఖాళీ చేయించారు.
‘విదేశీ ముస్లింలపై ప్రతీకార దాడుల ప్రమాదం’
విదేశీ ముస్లింలైన అహ్మదీలపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని హక్కుల ఉద్యమకారులు చెప్తున్నారు. బాంబుదాడుల అనంతరం రేకెత్తిన ప్రజాందోళనను తగ్గించే చర్యల్లో భాగంగా పాఠశాలలను తనిఖీ చేస్తామని లంక ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సోమవారం నాడు ప్రకటించిన అత్యవసర పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. ఇది.. అనుమానితులను కోర్టు ఉత్తర్వులు లేకుండానే నిర్బంధించి విచారించటానికి పోలీసులకు అధికారం ఇస్తోంది.
బాంబు దాడుల ప్రభావంతో శ్రీలంక పర్యాటక పరిశ్రమ మందగించే అవకాశం ఉందని.. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 30 శాతం వరకూ పడిపోవచ్చునని.. దీనివల్ల 1.5 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు నెలకొన్నాయని ఆర్థిక మంత్రి మంగళ సమరవీర శుక్రవారం పేర్కొన్నారు.