గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (13:40 IST)

ఆఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం: నిద్రలోనే అనంత లోకాలకు.. వెయ్యిమంది?

Afganistan
Afganistan
ఆఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అఫ్ఘాన్‌ తూర్పులోని ఖోస్ట్‌ ప్రావిన్స్‌ పరిధిలోని పాక్‌ సరిహద్దులో ఉన్న పర్వత ప్రాంతం పక్టికా కేంద్రంగా భూమి కంపించడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో.. వందలాది మంది నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. 
 
ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండడంతో తీవ్రత ఎక్కువగా ఉందని ఐరోపా భూకంపాల అధ్యయన సంస్థ(ఈఎంఎస్‌ సీ) వెల్లడించింది. 
 
ఈ భూకంప తీవ్రత 500 కిలోమీటర్ల దాకా.. అంటే పాకిస్థాన్‌, భారత్‌ సరిహద్దుల వరకు ప్రభావం చూపిందని ఆ సంస్థ వివరించింది. మారుమూల ప్రాంతం కావడంతో తాలిబాన్‌ సర్కారు హెలికాప్టర్ల ద్వారా సహాయక బృందాలను తరలించింది. ఇప్పటి వరకు 1,000 మందికి పైగా చనిపోయి ఉంటారని అంచనా. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. 1,500 మంది వరకు క్షతగాత్రులున్నారు.
 
ఆఫ్ఘానిస్థాన్‌ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో భూకంపాలు సాధారణమే. అయితే.. బుధవారం నాటి భూకంపం రెండు దశాబ్దాల తర్వాత ఇదే అతిపెద్దది అని ఈఎంఎస్‌‌సీ వెల్లడించింది.