శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (12:42 IST)

బీచ్‌లో నడిచి వెళుతుంటే అదృష్టం వరించింది... ఎలా?

చాలా మందికి ఉన్నఫళంగా ధనవంతులై పోతుంటారు. అలాంటి వారిని చూస్తే.. అతనికి అదృష్టం వరించిందని అంటుంటారు. ఇపుడు ఓ మహిళకు కూడా అలాంటి అదృష్టమే వరించింది. బీచ్‌ ఇసుకలో నడిచి వెళుతుంటే రూ.కోట్లు వరించాయి. ఈ కోట్లు ఎలా వరించాయో తెలుసుకుందాం. 
 
 బీచ్‌లో అలా చ‌ల్ల‌గాలికి హాయిగా న‌డుస్తూ వెళ్తున్న ఓ మ‌హిళ‌కు ఊహించ‌ని వ‌స్తువు ఒకటి దొరికింది. ఆ వ‌స్తువు ఆమెను కోటీశ్వ‌రురాలిని చేసింది. ఇంత‌కీ ఆ వ‌స్తువు ఏంటి?  దానికి ఎందుకు అంత విలువ‌?  చూద్దాం ప‌దండి. 
 
థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ అనే మహిళ నియామ్రిన్ బీచ్‌లో న‌డుచి వెళుతుండగా, ఇసుక‌లో ఓ పెద్ద ముద్ద రూపంలో ఉన్న ఒక వస్తువు కంటికి కనిపించింది. ఈ ముద్ద నుంచి చేప‌ల వాస‌న రావ‌డాన్ని ఆమె పసిగట్టింది. ఇదేదో బాగుంద‌నిపించి దానిని ఇంటికి తీసుకెళ్లింది. 
 
అయితే, తనకు బీచ్‌లో లభించిన వస్తువు ఏంటో తెలియకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి ఆరా తీసింది. చివ‌రికి అది ఓ వేల్ క‌డుపులో నుంచి వ‌చ్చిన ముద్ద అని ఇరుగుపొరుగువారు తేల్చారు. వేల్ వాంతి చేసుకున్న‌ప్పుడు స‌ముద్ర ఉప‌రిత‌లంపై తేలుతూ తీరానికి కొట్టుకువ‌చ్చింది. దీనిని అంబిర్‌గ్రిస్ అని పిలుస్తారని చెప్పారు. 
 
చూడటానికి మైనంలా క‌నిపించే ఇది స్పెర్మ్‌ వేల్ పేగుల్లో త‌యార‌వుతుంది. దీనిని ప‌ర్ఫ్యూమ్‌(సెంటుల తయారీ)లో వాడ‌తారు. సువాస‌న‌లు చాలా ఎక్కువ‌సేపు ఉండ‌టానికి ఈ ప‌దార్థం ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే దీనికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. ఆ మ‌హిళ‌కు దొరికిన 12 అంగుళాల వెడ‌ల్పు, 24 అంగుళాల పొడ‌వు ఉన్న ఈ అంబిర్‌గ్రిస్ విలువ సుమారు రూ.1.9 కోట్లు ఉంటుంద‌ని అంచనా వేశారు. 
 
ఈ విషయం నలువైపులా పాకిపోయింది. దీంతో సిరిపోర్న్ ద‌గ్గ‌ర ఉన్న అంబిర్‌గ్రిస్ అస‌లుదేనా? కాదా? అని పరీక్ష చేయ‌డానికి నిపుణులు రానున్నారు. అది క‌నుక్కోవ‌డానికి ఇప్ప‌టికే ఆమె దానికి లైటుగా వేడి త‌గిలించి చూసింది. వేడి త‌గిలిన‌ప్పుడు క‌రిగిన ఆ ప‌దార్థం.. చ‌ల్ల‌బ‌డ‌గానే గట్టిప‌డింది. ఇప్పుడు నిపుణులు కూడా అది అస‌లైన అంబిర్‌గ్రిస్ అని నిర్ధారిస్తే.. ఆమె పంట పండిన‌ట్లే. దానిని అమ్మి వ‌చ్చిన డ‌బ్బుల‌తో త‌న క‌మ్యూనిటీకి సాయం చేస్తాన‌ని ఆమె చెబుతోంది.