శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (08:48 IST)

అమెరికాలో కరోనా కల్లోలం... 5 రోజుల్లో 10 లక్షల కొత్త కేసులు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడిపోతోంది. గత ఐదు రోజుల్లో ఏకంగా పది లక్షల కొత్త పాజిటివ్ కేసులు నమోదుకావడమే ఇందుకు నిదర్శనం. 
 
అమెరికాలో తొలి కరోనా కేసు ఈ యేడాది జనవరి నెలలో వెలుగు చూసింది. ఆ తర్వాత 100 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే కొత్తగా 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా ప్రజలు వణికిపోతున్నారు. 
 
తాజాగా జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడచిన మంగళవారం నుంచి శనివారం మధ్య కొత్తగా 10,00,882 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 45 లక్షలు దాటిందని పేర్కొంది. 
 
కాగా, ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి అగ్రరాజ్యంలో 2,81,199 మంది కన్నుమూశారు. నవంబరు నుంచి ప్రతీరోజూ కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికితోడు వివిధ ఆసుపత్రులలో చేరుతున్న కరోనా బాధితులు సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. 
 
ట్రంప్ న్యాయవాదికి కరోనా 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 
 
రూడీకి కరోనా సోకడంపై ట్రంప్ స్పందించారు. న్యూయార్క్ మేయర్‌గా పనిచేసిన రూడీ అమెరికా ఎన్నికల్లో జరిగిన అక్రమాల వెలికితీత కోసం పోరాడుతూ వైరస్ బారినపడినట్టు ట్రంప్ పేర్కొన్నారు.
 
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా, కుమారుడు డొనాల్డ్ జూనియర్, ఆయన కుమారుడు బారన్, ప్రెస్ సెక్రటరీ, సలహాదారులు, ప్రచార నిర్వాహకులు వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 
 
ఇటీవల రూడీ కుమారుడు ఆండ్రూ కూడా వైరస్ బారినపడి కోలుకున్నారు. ట్రంప్ చుట్టూ ఉన్నవారు వరుసపెట్టి కరోనా బారినపడుతున్నారని సీనియర్ సలహాదారు డేవిడ్ గెర్డెన్ తెలిపారు.