1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (13:41 IST)

బ్యాక్టీరియా సోకిన చేపను తిని కాళ్ళుచేతులు పోగొట్టుకున్న మహిళ...

fish
అమెరికాలోఓ విషాదకర ఘటన జరిగింది. బ్యాక్టీరియా సోకిన చేపను ఆరగించిన ఓ మహిళ కాళ్లు, చేతులు పోయాయి. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 40 ఏళ్ల లారా బరాజాస్‌ అనే మహిళకు విబ్రియో వల్నిఫికస్‌ అనే అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా సోకింది. ఆ బ్యాక్టీరియా ఎక్కువగా సముద్ర ఆహారం, సముద్ర నీటిలో ఉంటుంది. కాలిఫోర్నియాలోని స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన టిలపియా చేప తిన్న తర్వాతే ఆమె అనారోగ్యానికి గురయ్యారని లారా స్నేహితురాలు అన్నా మెస్సినా మీడియాకు వెల్లడించారు. 
 
'ఆమె ప్రాణాలు పోయినంతపనైంది. కొంతకాలం పాటు ఆమె రెస్పిరేటర్‌పై ఉంది. డాక్టర్లు ఆమెను వైద్యపరమైన కోమాలో ఉంచారు. ఆమె కింది పెదవి, వేళ్లు, పాదాలు నల్లగా మారాయి. కిడ్నీల పనితీరు దెబ్బతింది. శరీరం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఈ ఘటన మాపై ఎంతో ప్రభావం చూపింది. ఇది మాకు భయానక అనుభవం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు' అని మెస్సినా ఆవేదన వ్యక్తం చేశారు.
 
లారా కొద్దికాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత.. గత వారం ఆమెకు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారు. ప్రాణాలు కాపాడేక్రమంలో వైద్యులు ఆమె కాళ్లూచేతులు తొలగించారు. ఈ ఘటన సముద్ర ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అవసరాన్ని నొక్కి చెప్తోందని నిపుణులు హెచ్చరించారు.