శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (10:50 IST)

కరోనా కల్లోలం : అమెరికాలో మెడికల్ ఎమర్జెన్సీ - నివారణకు 5 వేల కోట్ల డాలర్లు

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ సోకుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 5436 మంది చనిపోయారు. 1.50 లక్షల మంది ఈ వైరస్‌బారినపడ్డారు. పైగా, అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వైరస్ దెబ్బకు వణికిపోతోంది. అమెరికాలోనూ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (హెల్త్ ఎమర్జెన్సీ) విధించారు. అలాగే, నివారణ చర్యల కోసం 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
గతంలో ట్రంప్ కరోనా బాధితులను కలుసుకున్న నేపథ్యంలో తాను ఇప్పటివరకు కరోనా పరీక్షలు చేయించుకోలేదని, చేయించుకునే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను ట్రంప్ కలిశారు. 
 
తాజాగా ఫాబియోకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, బోల్సోనారోకు మాత్రం కరోనా సోకలేదని తేలింది. ఈ విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. తాను దాదాపు రెండు గంటలపాటు బోల్పోనారోతో కలిసి ఉన్నట్టు చెప్పారు. 
 
ఇద్దరం కలిసి భోజనం చేశామని, పక్కపక్కనే ఉన్నామన్నారు. అయితే, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని, కాబట్టి తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని డోనాల్డ్ ట్రంప్ వివరించారు.