దేశంలో కరోనా డేంజర్ బెల్స్... రెండో మృతి నమోదు... కోలుకున్న టెక్కీ
దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన 74 యేళ్ళ బెంగుళూరు వాసి మృతి చెందారు. ఇది దేశంలో నమోదైన తొలి కరోనా మరణం. ఇపుడు మరో కేసు నమోదైంది. అది దేశ రాజధాని ఢిల్లీలో. దీంతో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య రెండింటికి చేరింది.
కరోనా లక్షణాలతో ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన 68 ఏళ్ల ఢిల్లీ మహిళ మృతి చెందింది. ఈ మేరకు ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ తెలిపారు. గత నెలలో స్విట్జర్లాండ్ నుంచి కుమారుడితో కలిసి వచ్చిన సదరు మహిళకు పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
దీంతో ఈ నెల 7న ఆమెను రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 9న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్స్‌పైనే ఉంచి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారడంతో గత రాత్రి ఆమె మృతి చెందారు. అలాగే, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 82కు చేరింది.
హైదరాబాద్‌లో కోలుకున్న టెక్కీ
ఒకవైపు విషాద వార్త వింటే.. మరోవైపు శుభవార్త తెలిసింది. కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన హైదరాబాద్‌కు చెందిన టెక్కీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. హైదరాబాద్‌లోని మహీంద్రాహిల్స్‌కు చెందిన టెక్కీ ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడు. ఈ నెల 1న కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరాడు.
తొమ్మిది రోజుల చికిత్స అనంతరం అతడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఐదు రోజుల క్రితం మరోమారు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో రిపోర్టులు నెగటివ్ అని వచ్చాయి. అయితే, మరింత స్పష్టత కోసం నమూనాలను పూణె ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా నెగటివ్ అని రావడంతో శుక్రవారం రాత్రి ఆ టెక్కీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ వార్త తెలిసిన నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
డిశ్చార్జ్ అయినప్పటికీ మరో 14 రోజులపాటు ఐసోలేషన్‌లోనే ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. ఒకసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆ వైరస్ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. వైరస్ సోకిన అందరూ ప్రాణాలు కోల్పోతారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
నిత్యావసర వస్తు జాబితాలో మాస్కులు
ఇదిలావుంటే, దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. మాస్కులు, శానిటైజర్లను నిత్యావస వస్తు జాబితాలో చేర్చింది. కరోనా వ్యాప్తి కారణంగా వాటిని నిత్యావసరాల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలకు సూచించింది. మాస్కులు, శానిటైజర్లను సామాన్యులకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. తక్కువ ధరకే అందించేలా చూడాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేయనివారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. సహాయకేంద్రాల నంబర్లు, నిత్యావసరాల జాబితా ప్రచురించాలని పేర్కొంది.