సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (11:27 IST)

ఒత్తిడికి తలొగ్గిన అమెరికా ... భారత్‌ ఆదుకునేందుకు సిద్ధం

ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా దిగివచ్చింది. క‌రోనాతో అత‌లాకుత‌ల‌మైన ఇండియాను ఆదుకోవాలంటూ అన్ని వైపుల నుంచి వ‌చ్చిన ఒత్తిడికి త‌లొగ్గింది. ఇండియాకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందించ‌నున్న‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్ల‌డించారు. 
 
ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో భారత్‌కు సాయం చేయాలంటూ యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తోపాటు అక్క‌డి చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖ ఇండియ‌న్‌-అమెరిక‌న్‌లు బైడెన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌తోపాటు అవ‌స‌రమైన ఇత‌ర కొవిడ్ మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని వాళ్లు డిమాండ్ చేశారు. దీంతో అధ్యక్షుడు జో బైడన్ తలొగ్గారు. 
 
దీనిపై బ్లింకెన్ స్పందించారు. కొవిడ్ మ‌హ‌మ్మారితో స‌త‌మ‌వుతున్న భారత ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం. భార‌త ప్ర‌భుత్వంలో ఉన్న మా భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. ఇండియాకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందిస్తాం అని బ్లింకెన్ చెప్పారు. 
 
అటు వైట్‌హౌజ్ నేష‌నల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్ జేక్ స‌ల్లివాన్ కూడా దీనిపై స్పందించారు. ఇండియాలో కొవిడ్ ప‌రిస్థితుల‌పై అమెరికా తీవ్ర ఆందోళ‌న చెందుతోంది. ఇండియాలోని స్నేహితులు, భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. కొవిడ్‌పై పోరాడుతున్న ఇండియాకు మ‌రింత సాయం చేయ‌డానికి 24 గంట‌లూ శ్ర‌మిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.