గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (23:35 IST)

భారత్‌లో కరోనా: కఠిన లాక్డౌన్ అవసరం.. మేలో పరిస్థితి..?: అమెరికా హెచ్చరిక

భారత్‌లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశం పాక్ కూడా తాజాగా సంఘీభావం ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతించమని ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి. భారత్‌లోని పరిస్థితిపై అంతర్జాతీయ మీడియా కూడా విస్తృతంగా కథనాలు ప్రచురిస్తోంది. 
 
భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరమని వ్యాఖ్యానించిన వాషింగ్టన్ పోస్ట్.. జాగ్రత్తలు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది. ''కరోనా ఆంక్షలు ముందస్తుగానే సడలించడంతో కరోనా పేట్రేగిపోయింది. ఇది సూదురంగా ఉన్న దేశంలోని సమస్య కాదు. ప్రస్తుత సంక్షోభ స్థితిలో ఎంతటి దూరాన ఉన్న దేశమైనా సమీపాన ఉన్నట్టే'' అంటూ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
 
ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా వ్యాప్తి విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మే మొదటి వారంలో 5 లక్షల కేసులు రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని మిచిగాన్ ప్రొఫెసర్ భ్రమార్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. మే చివరి వారంలో రోజు 5,500 మరణాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్ట్ చివరి నాటికి కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. డబుల్ మ్యూటంట్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. 
 
మే 11 నుంచి 15 నాటికి పీక్ దశలో కరోనా ఉంటుందని తెలిపారు. భారత్‌లో కఠిన లాక్ డౌన్ అవసరం ఉందని చెప్పారు. వెలుగులోకి రాని కేసులు మరణాలు ఎన్నో ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పట్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కాదని మే నెలలో తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.