యూఎస్ ఎన్నికలు : ట్రంప్ ఎత్తుగడలు చిత్తు... ఎలక్టోరల్ ఓట్లలో బైడెన్‌దే గెలుపు...

joe biden
ఠాగూర్| Last Updated: మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:03 IST)
గత నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. కానీ, ఈ ఓటమిని ఆయన జీర్ణించుకోలేదు. దీంతో న్యాయపోరాటానికి దిగారు. పలు కోర్టుల్లో ఆయనకు చుక్కెదురైంది. అయినప్పటికీ.. ఓటమిని అంగీకరించి, వైట్‌హౌస్‌ను వీడేందుకు ఆయన ససేమిరా అన్నారు.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేశారు. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం.. బైడెన్‌కు 306 ఓట్లు రాగా, ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఫలితాలపై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ స్పందిస్తూ, 'చాలా ఏళ్ల క్రితమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే జ్యోతి వెలిగింది. మహమ్మారిగానీ, అధికార దుర్వినియోగంగానీ ఆ వెలుగును ఏమాత్రం మసకబార్చలేవు. ఐకమత్యానికి అద్దం పట్టేలా చరిత్రలో మరో పుటను తిరగవేసే సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధంలో అమెరికా ఆత్మ, ప్రజాస్వామ్యం గెలుపొందాయి. తమ ఉనికిని చాటుకున్నాయి' అంటూ కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు వేసిన ఎత్తుగడలు చిత్తు అయిపోయాయంటూ రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన మద్దతుదారులను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. వాస్తవాన్ని అంగీకరించకుండా దానిని మార్చాలన్న వారి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదంటూ బైడెన్‌ విమర్శించారు. అంతేకాకుండా, డోనాల్డ్ ట్రంప్‌ ప్రయత్నాలను ఏకగ్రీకవంగా తిరస్కరించిన సుప్రీంకోర్టుకు బైడెన్‌ ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, '20 మిలియన్‌ మంది అమెరికన్‌ ప్రజల ఓట్లను ప్రభావితం చేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కొన్ని వర్గాలు. అధ్యక్ష అభ్యర్థి తను ఓడిపోయిన చోట్ల ఫలితాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. అయితే వ్యవస్థలపై నమ్మకంతో అమెరికా ప్రజలు ఓటు వేశారు. ఆ నమ్మకం నిలబడింది. ఎన్నికల వ్యవస్థ సమగ్రత రక్షించబడింది. చట్టం, అమెరికా రాజ్యాంగం, ప్రజల ఆకాంక్ష నెరవేరింది' అంటూ వ్యాఖ్యానించారు.

తన విజయం ఖరారైందని, ఆ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలే తప్ప ఎదురుదాడికి దిగాల్సిన అవసరం లేదన్నారు. మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం, వ్యాక్సినేషన్‌ తమ ముందున్న తక్షణ కర్తవ్యమని, అదేవిధంగా కోవిడ్‌ సంక్షోభం కారణంగా నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటామని అమెరికాకు కాబోయే 46వ అధ్యక్షుడు జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. తాను అమెరినక్లందరికీ ప్రెసిడెంట్‌ను అని మరోసారి స్పష్టం చేశారు.దీనిపై మరింత చదవండి :