అమెరికాలో పిడుగుల ధాటికి వేలాది విమానాల నిలిపివేత...
అమెరికాలో పిడుగుల ధాటికి వేలాది విమానాల నిలిపివేశారు. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు, భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఇంకోవైపు, ఈశాన్య అమెరికా రాష్ట్రాల్లో పిడుగులు పడుతున్నాయి. దీంతో ఏకంగా 2600 విమాన సర్వీసులను నిలిపివేశారు. మరో ఎనిమిదివేల విమానాలను రీషెడ్యూల్ చేశారు.
అమెరికా ఈశాన్య రాష్ట్రాల్లో పిడుగుల ప్రభావం అధికంగా ఉంది. ఈ కారణంగా ఈశాన్య ప్రాంతంలోనే 1320 విమానాలను రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులకు విమానాశ్రయాలు కిక్కిరిసిపోయివున్నాయి.
కాగా, ఈశాన్య అమెరికా రాష్ట్రాలకు జాతీయ వాతావరణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. భారీ వర్షాలతో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. అదేసమయంలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో టోర్నడోల పట్ల కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది.