చైనా బెలూన్లపై బ్రిటన్ ప్రధాని హెచ్చరిక - దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఎంతకైనా సిద్ధం...
పలు అగ్ర దేశాలను చైనా బెలూన్లు కలవపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ తరహా బెలూన్లను అగ్రరాజ్యం అమెరికా కూల్చివేసింది. దీంతో చైనా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. తాజాగా చైనా బెలూన్లు బ్రిటన్‌ను కూడా టార్గెట్ చేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు.
దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అమెరికా గగనతలంలో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన కొద్దిగంటలకే రిషి సునక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దీనిపై ఆయన స్పందిస్తూ, "ప్రజలకు చెబుతున్నదేంటంటే.. బ్రిటన్ సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం" అని రిషి సునాక్ ప్రజలకు భరోసా ఇచ్చారు. బ్రిటన్ గగనతలంలో అనుమానాస్పద వస్తువులను యుద్ధ విమానాలతో కూల్చేందుకు తాము సిద్ధమేనని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. "అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు క్విక్ రియాక్షన్ రెస్పాన్స్ ఫోర్స్ సిద్ధం చేశాం" అని అన్నారు.