మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు ప్రధాని మోడీ ఫోన్ - స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై..

Modi
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన పౌరుడు రిషి సునక్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఇరు దేశాల స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై కొద్దిసేపు చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, ప్రధాని మోడీకి రిషి సునక్ ధన్యవాదాలు తెలిపారు. 
 
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నిలిచిన చర్చలను వీలైనంత త్వరగా ముగించాలని వారిద్దరూ ఈ సందర్భంగా ఓ అంగీకారానికి వచ్చినట్టు ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
భద్రత, రక్షణ, ఆర్థిక రంగాల్లో కలిసి పని చేయడం ద్వారా ఇరు దేశాలు ఎంతో సాధించవచ్చన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సానుకూలంగా స్పందించారు. 
 
ఈ ఒప్పందంపై గత జనవరిలో ప్రారంభమైన చర్చలు బ్రిటన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునక్ ఇపుడు బ్రిటన్ ప్రధాని కావడంతో తిరిగి ఈ ఒప్పందంపై చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.