1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 27 అక్టోబరు 2022 (16:11 IST)

రిషి సునక్‌ను అభినందించడం, సోనియా గాంధీని వ్యతిరేకించడం.. బీజేపీ ద్వంద్వ వైఖరి కాదా?

rishi sunak
రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయిన తరువాత భారతదేశంలోని రాజకీయ పార్టీలు, నాయకులు, సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇది సంతోషించవలసిన పరిణామం అని, గర్వకారణమని కొందరు అభిప్రాయపడుతుండగా, బ్రిటన్‌లో మైనారిటీ హిందువుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కల్పించిన తీరును ప్రశంసిస్తూ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ దీని నుంచి పాఠం నేర్చుకోవాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

 
సునక్ బ్రిటన్ ప్రధాని అయ్యారన్న వార్త విని బీజేపీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. రిషీ సునక్ ఒక హిందువు అని చెబుతూ, బీజేపీ నేతలు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రిషి సునక్‌ను అభినందిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, "మీరు మీ హిందూ మూలాల పట్ల గర్విస్తున్నారు. మీరు సాధించిన ఈ ఉన్నతి పట్ల మేమూ గర్విస్తున్నాం" అని ట్వీట్ చేశారు. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా కూడా రిషి సునక్‌ను అభినందిస్తూ, దీపావళి నాడు ధర్మపరాయణుడైన ఒక హిందువు బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారంటూ ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా రిషి సునక్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ దీపావళి విషయాన్ని ప్రస్తావించారు.

 
42 ఏళ్ల రిషి సునక్, బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక నివాసమైన 11 డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి రోజున దీపం వెలిగిస్తూ కనిపించారు. రిషి సునక్ 2015లో బిజినెస్ స్టాండర్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "జనాభా లెక్కలు సేకరించినప్పుడు బ్రిటిష్ ఇండియన్ అన్న దానిపై నేను టిక్ పెడతాను. దానికి ఇక్కడ మాకొక వర్గం ఉంది. అయితే, నేను పూర్తిగా బ్రిటిష్ వాడిని. ఇదే నా ఇల్లు, ఇదే నా దేశం. కానీ, నాకు మతం, సంస్కృతి పరమైన వారసత్వం భారతదేశం నుంచి వచ్చింది. నా భార్య భారతీయురాలు. నేను హిందువునని బహిరంగంగా చెప్పుకుంటాను" అని అన్నారు. రిషి సునక్ ప్రధాని అయిన తరువాత అమెరికా మీడియా సంస్థ సీఎన్ఎన్ రాసిన ఒక కథనంలో పై ఇంటర్వ్యూను ప్రస్తావించారు.

 
రిషి సునక్ గతంలో ఆర్థిక మంత్రిగా ఎన్నికైనప్పుడు భగవద్గీతపై చేయి వేసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంవత్సరం ప్రధాని ఎన్నికలకు ప్రచారం చేస్తున్నప్పుడు, కృష్ణాష్టమి రోజు పూజ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రిషి సునక్‌ బ్రిటన్ ప్రధాని కావడం పట్ల బీజేపీ నేతలే కాకుండా, సామాన్య హిందువులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న ఈ సంవత్సరంలోనే రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడం ప్రత్యేకమైనదని కొందరు భావిస్తున్నారు.

 
సోనియా గాంధీని విదేశీయురాలన్న సుష్మా స్వరాజ్
140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రజలు.. విదేశాలలో ఉన్న భారతీయులు లేదా భారతదేశంతో అనుబంధం ఉన్న వ్యక్తులు సాధించిన ప్రగతికి ఎప్పుడూ గర్విస్తారు. కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయినప్పుడు, సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ సీఈవో అయినప్పుడు ఇలాగే గర్వించారు. అయితే, భారతీయులు ఇలాంటి విషయాలకు సంతోషించడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు, ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.

 
సోనియాగాంధీ ప్రధాని అయితే గుండు గీయించుకుని తెల్లని దుస్తులు ధరిస్తానని బీజేపీ సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు. హిందూ మతంలో అది అశుభానికి ప్రతీక. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్‌పై విజయం సాధించారు. బళ్లారి ఎన్నికలను 'దేశ పుత్రిక vs విదేశీ కోడలు'గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది బీజేపీ. అయితే, ఆ వ్యూహం బెడిసికొట్టింది. సోనియాగాంధీ విజయం సాధించారు. సుష్మా స్వరాజ్, సోనీయా గాంధీల మధ్య చిచ్చు ఆ ఏడాది నుంచే ప్రారంభమైందని పలువురు భావిస్తారు. సుష్మా స్వరాజ్ జీవించి ఉన్నంత కాలం సోనియా గాంధీ ప్రధాని పదవిపై తన వైఖరిని వీడలేదు.

 
2013లో సుష్మా స్వరాజ్ ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ, "సోనియా గాంధీతో నాకు ఒకే ఒక్క గొడవ ఉంది. నేను ఆమెను ప్రధానిగా అంగీకరించలేను. ఎంతో హింస, ఎన్నో త్యాగాల తరువాత నా దేశం బానిసత్వం నుంచి విముక్తి పొందింది. నేడు స్వతంత్ర భారతదేశంలో సామర్థ్యం, అర్హత ఉన్న భరతమాత బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు కాంగ్రెస్‌లో కూడా ఉన్నారు. కానీ, సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటే నేనొప్పుకోను. దాన్ని వ్యతిరేకిస్తాను. నా వైఖరి మారదు" అని అన్నారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని భారత రాజ్యాంగం అనుమతిస్తుందని చెప్పినప్పుడు, సుష్మా స్వరాజ్ పైవిధంగా స్పందించారు.

 
భారతదేశంలో మైనారిటీల పట్ల నిర్లక్ష్యం మాటేమిటి?
రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడంపై బీజేపీ నేతలు హర్ష వ్యక్తం చేస్తున్నప్పుడు, అనేకమంది సోనియా గాంధీ విషయాన్ని గుర్తుతెచ్చారు. ప్రజాస్వామ్యం అంటే అందరినీ కలుపుకుపోవడమేనని చెబుతూ, క్రిస్టియన్లు, తెల్లజాతీయులు మెజారిటీగా ఉన్న దేశంలో, గోధుమరంగు వ్యక్తిని, మైనారిటీ హిందువును ప్రధానిగా ఎన్నుకున్నారని నొక్కి చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరని, దేశంలో ముస్లింల జనాభా దాదాపు 20 శాతం ఉండగా, బీజేపీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరని ఎత్తిచూపారు.

 
రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అవుతారన్న వార్త బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ, "ఇదే నిజమైతే, బ్రిటిషర్లు అపురూపమైన పనిచేశారని మనం గుర్తించాలి. ఒక మైనారిటీ వ్యకికి దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవిని అప్పగించడం అరుదైన విషయం. రిషి సునక్ విజయానికి భారతీయులుగా మనం సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే నిజాయితీగా ఒక్క ప్రశ్న వేసుకుందాం.. అలాంటిది ఇక్కడ జరుగుతుందా?" అంటూ ట్వీట్ చేశారు. అలాగే, 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రధాని కావడంపై వచ్చిన వ్యతిరేకతను గుర్తుచేశారు. సోనియా గాంధీ విదేశీయురాలని, ఆమె ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని ఒక ప్రముఖ బీజేపీ నేత శపథం పట్టారని కూడా కూడా గుర్తుచేశారు.

 
"సోనియా గాంధీ ప్రధాని కావాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. మన్మోహన్ సింగ్ మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారన్నది నిజమే కానీ, మన దేశంలో హిందువులను, సిక్కులను వేరు చేసి చూడరు. మెజారిటీవాదం రాజకీయ వ్యూహంగా మారిన పరిస్థితులలో హిందువేతర వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి కావడం మనం ఊహించగలమా? ఇది జరిగిన రోజు భారతదేశం నిజంగా పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవిస్తుంది" అని శశి థరూర్ అన్నారు.

 
సిక్కులను హిందువేతరులుగా ఎందుకు భావించరు?
శశిథరూర్ వేసిన ప్రశ్నలనే దేశంలోని మరికొందరు రాజకీయ నేతలు కూడా సంధించారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, ఒకవైపు బ్రిటన్ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడితే, మరోవైపు భారతదేశం ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి విభజన, వివక్షపూరిత చట్టాలను రూపొందించడంలో నిమగ్నమైందని అన్నారు. అయితే, బీజేపీ ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది. "భారతదేశానికి ముగ్గురు ముస్లింలు, ఒక సిక్కు రాష్ట్రపతిగా వ్యవహరించారు. సిక్కు మతానికి చెందిన వ్యక్తి పది సంవత్సరాలు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు. భారతదేశ న్యాయవ్యవస్థలో మైనారిటీలు అగ్రస్థానంలో ఉన్నారు. సైన్యానికి కూడా నాయకత్వం వహించారు. మనం ఇతర దేశాల నుంచి భిన్నత్వం, సామరస్య రాజకీయాలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు" అని బీజేపీ ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జి అమిత్ మాల్వియా అన్నారు.

 
కాగా, భారతదేశంలో రాష్ట్రపతి పదవిని సెరిమోనియల్ అంటే సంప్రదాయంగా వస్తున్న ఒక ఆచారంగా పరిగణిస్తారు. రాష్ట్రపతికి చాలా రకాల అధికారాలు ఉండవు. అందుకే ఆ పదవిని రబ్బర్ స్టాంప్ అని కూడా అంటారు. కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉంటే, వారికి అనుగుణమైన నిర్ణయాలు రాష్ట్రపతి తీసుకుంటారని చెప్పడానికి భారత రాజకీయాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది. గతంలో జాకీర్ హుస్సేన్, ఫకృద్దీన్ అలీ అహ్మద్ కూడా భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించారు. సిక్కు మతస్థుడైన జ్ఞానీ జైల్ సింగ్ భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఆర్మీ చీఫ్‌గా సిక్కులు ఉన్నారు, తప్పితే ముస్లింలు ఎప్పుడూ లేరు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ముస్లింలు ఉన్నారు.

 
భారతదేశంలో చాలావరకు సిక్కులు, బౌద్ధులు, జైనులను హిందూ మతంలో భాగంగా పరిగణిస్తారు. సావర్కర్ హిందుత్వ సిద్ధాంతం కూడా సిక్కు, బౌద్ధ, జైన మతాలను ప్రత్యేక మతాలుగా చూడలేదు. సావర్కర్ సిద్ధాంతంలో మాతృభూమి, పవిత్రభూమి అనే రెండు అంశాలున్నాయి. భారతదేశంలో పుట్టిన మతానికి ఇదే పవిత్రభూమి అని, ఇస్లాం ఇక్కడ పుట్టలేదు కాబట్టి ముస్లింలకు భారతదేశం మాతృభూమి కాగలదేమోగానీ పవిత్రభూమి కాలేదని ఆయన వాదించేవారు. అందుకే వారి విధేయత మాతృభూమి, పవిత్రభూమి మధ్య విభజించి ఉంటుందని సావర్కర్ అంటారు. ఈ తర్కం ఆధారంగా, హిందుత్వ రాజకీయాలు సిక్కులు, బౌద్ధులు, జైనులను హిందూ మతంలో భాగంగా చూస్తాయి.

 
బీజేపీ ద్వంద్వ వైఖరి?
రిషి సునక్ ప్రధాని అయితే బీజేపీ సంతోషించడం ఎంతవరకు సమంజసం? "భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. కానీ, వివిధ దేశాల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవంలోకి మారినవారే. రిషి సునక్ విషయంలో అలా కాదు. ఆయన తాను హిందువునని బహిరంగంగా చెప్పుకున్నారు. హిందూ ఆచారాలను బహిరంగంగా పాటిస్తున్నారు కూడా. కాబట్టి బీజేపీ నేతలు సంతోషిస్తున్నారు. ఇందులో తప్పేం లేదు, నష్టమూ లేదు" అని బీజేపీ అనుకూల జర్నలిస్టు ప్రదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీని వ్యతిరేకించడం, రిషి సునక్‌ను అభినందించడం.. బీజేపీ ద్వంద్వ వైఖరి కాదా?

 
"రిషి సునక్ బ్రిటన్‌లో జన్మించారు. ఆయన ఆ దేశ పౌరుడు. కానీ, సోనియా గాంధీ వివాహం తరువాత ఇక్కడకు వచ్చారు. చాలా కాలం తరువాత ఆమెకు భారతదేశ పౌరసత్వం లభించింది. కావాలనుకుంటే సోనియా గాంధీ ప్రధాని అయ్యేవారు. బీజేపీ అడ్డుకుందని చెప్పలేం. రిషి సునక్‌ను అక్కడి ప్రజలు ప్రధానిని చేయలేదని, కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు చేశారని గుర్తుంచుకోవాలి. ప్రజలు ఎన్నుకుంటారా లేదా అనేది ఇంకా పరీక్షించవలసి ఉంది. అందుకే సోనియా గాంధీతో పోల్చడం సరికాదు" అని ప్రదీప్ సింగ్ అన్నారు. బీజేపీ సంతోషానికి అర్థం లేదని అలహాబాద్ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్ హేరంబ్ చతుర్వేది అన్నారు.

 
"ఈయూలో భాగం కాలేకపోయిన బ్రిటన్‌కు హిందువు పీఎం అయితే జనాలు సంతోషిస్తున్నారు. సుయెల్లాను హోం మంత్రిని చేయడం ద్వారా రిషి సునక్ తన సందేశం ఇచ్చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం గురించి సుయెల్లా మాట్లాడుతూ భారతీయుల వలసలు పెరుగుతాయని అన్నారు. భారతదేశం ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించింది కూడా. బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలి. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకోవాలి" అని హేరంబ్ చతుర్వేది అన్నారు.