అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌గా 'ఘోస్ట్ టౌన్' వైట్‌హౌస్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అమెరికా కుదేలేంది. ఈ వైరస్ బారినుంచి ఈ అగ్రరాజ్యం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఇపుడు కరోనా వైరస్‌కు కేంద్రం(హాట్‌స్పాట్)గా మారింది.
నిజానికి కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అట్టుడుకిపోతున్న సమయంలో అమెరికా అత్యంత సురక్షితమైన ప్రాంతం ఏదైనా ఉందంటే.. అది ఒక్క అధ్యక్ష కార్యాలయంగా చెబుతూ వచ్చారు. కానీ, ఇపుడు పరిస్థితి మరోలావుంది. ఇపుడు కరోనా హాట్ స్పాట్‌గా ఈ శ్వేతసౌథం మారింది.
దీనికి కారణంగా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే. ఆయనకు వైరస్ సోకింది. అయినప్పటికీ.. కోవిడ్ నిబంధనలకు తూట్లుపొడిచారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉండాల్సిన ఆయన ఇపుడు తన కార్యాలయంలో చక్కర్లు కొడుతున్నారు. పైగా, ముఖానికి మాస్క్ ధరించకుండానే తన కింద సిబ్బందితో మాట్లాడుతున్నారు.
ఈ కారణంగా గత వారం రోజుల వ్యవధిలో వైట్ హౌస్‌లో డజను మందికి పైగా కరోనా సోకింది. అంటే, బాధితులకు దాదాపు ట్రంప్ ఆసుపత్రికి వెళ్లకముందే వైరస్ సోకి ఉంటుంది. అమెరికాలోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు ఉన్న వైట్ హౌస్, ఇప్పుడు కరోనాకు హాట్ స్పాట్‌గా మారిపోయింది.
ఇక సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలో పలువురికి వైరస్ సోకినట్టుగా తెలుస్తుండగా, ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారన్న విషయాన్ని వెల్లడించేందుకు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు. ట్రంప్ వైఖరితో అటు సిబ్బంది, ఇటు ఉన్నతాధికారులు భయంతో వణికిపోతున్నారు.
మరోవైపు, ఈ వైరస్ బారినపడిన డోనాల్డ్ ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆయన కోలుకునేందుకు మరో వారం రోజుల సమయమన్నా పడుతుందని ట్రంప్ ప్రత్యేక వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్‌కు ఇప్పటివరకూ నాలుగు డోస్‌ల రెమిడెసివిర్‌ను వైద్యులు ఇచ్చారని అన్నారు.
ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే, కరోనా బారినపడిన వారు కనీసం 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కానీ, ట్రంప్ మాత్రం వారి వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోకుండా వైట్‌హౌస్‌లో యధేచ్చగా తిరుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.