వ్యాక్సిన్ కోసం దేశాలు పోటీపడటం మంచిది కాదు : అథనామ్ గేబ్రియేసన్
కరోనా వైరస్‌కు విరుగుడు కోసం తయారు చేస్తున్న వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు పోటీపడటం ఏమాత్రం సముచితంకాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియేసన్ అన్నారు. ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి.
దీనిపై ఆయన స్పందిస్తూ, తమ దేశ ప్రజలను కరోనా బారి నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజమేనని, అయితే, వ్యాక్సిన్‌ను ఎంత సమర్థంగా వాడగలం అన్న అంశం మీదే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ నేషనలిజం వల్ల కరోనా మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేగానీ, దాన్ని నియంత్రించే అవకాశం ఉండదని చెప్పారు. యూరప్ దేశాల్లో వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు.
కరోనా విజృంభణ చాలా ప్రమాదకరంగా ఉందని అన్నారు. వీటి వల్ల మళ్లీ కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందుకే వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైంది కాదన్నారు.
వ్యాక్సిన్ వస్తే దాన్ని అన్ని దేశాల్లోనూ వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయని తెలిపారు. వాక్సిన్‌ను ఇలా సమర్థంగా వాడితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలిపారు. కాగా, వ్యాక్సిన్ విషయంలో అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో ముందస్తుగా వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే.