'ఎవడే సుబ్రహ్మణ్యం', తర్వాత 'భలే భలే మగాడివోయ్'తో తన కెరీర్లోనే మంచి విజయాన్ని అందుకున్న హీరో నాని. ఆ తర్వాత వస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ'. ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకొని నానితో ఇంటర్వ్యూ.
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' టైటిల్‌కు కారణం?
సినిమా టైటిల్ పెట్టడానికి కష్టమైంది. చాలా టైటిల్స్ అనుకున్నాం. కాని ఏది సెట్ కాలేదు. అసలు సినిమా దేని గురించి? దాని కథేంటి? అని ఆలోచించగానే టైటిల్ లోనే కథ అర్ధమయ్యే విధంగా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనుకున్నాం. ఆ టైటిల్‌లో కూడా మంచి జానపదం ఫీల్ కలిగింది. అనంతపురం, హిందూపూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలను టచ్ చేసి చాలా రోజులయ్యింది. రియల్ లోకేషన్స్‌కి వెళ్లి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఈమధ్య ఎలాంటి సినిమాలు రాలేదు. చక్కటి ఫీల్ కలగాలని టైటిల్‌లో కూడా పెద్దగా ఉండేలా చూసుకున్నాం.
పాతబడిపోయిన ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకోవడానికి కారణం?
ఫ్యాక్షనిజాన్ని ఇప్పటిదాకా ఒక కోణంలో చూసారు.. కానీ ఈ సినిమాలో పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎక్కడా రెగ్యులర్ టిపికల్ ఫ్యాక్షన్ స్టైల్‌లో ఒక్క సీన్ కూడా ఉండదు. ప్రతిది చాలా స్మూత్‌గా ఉండేలా డీల్ చేసాం.
ఈ 'గాథ' ఎలా మొదలైంది?
దర్శకుడు హను నాకు చాలా కథలు చెబుతూ నా వెనుక తిరుగుతూనే ఉన్నాడు. తను చెప్పిన చాలా కథలకి నేను నో చెబుతూ వచ్చాను. ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌ని ఓకే చేసాను. ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచీ నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాను. నా సైడ్ నుంచి చిన్నచిన్న సలహాలు కూడా ఇచ్చాను.
పాత్ర ఎలా వుంటుంది?
కృష్ణ అనే ఓ పిరికివాడి పాత్ర చేసాను. తన 15 ఏళ్ళ ప్రేమ కోసం ఎలాంటి అసాధారణ సంఘటనలను ఎదుర్కున్నాడు అనేదే కథ. సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. సీమలోని పరిస్థితులకు ఎలా ఎదురెళ్ళి నా ప్రేమను గెలిపించుకున్నాను అన్నదే కృష్ణగాడి వీర ప్రేమగాథ.
బాలకృష్ణ అభిమానిలా న్యాయం చేశారా?
ఈ సినిమా మొత్తాన్ని హిందూపూర్‌లో షూట్ చేసాం. హిందూపూర్ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ బాలయ్యగారి నియోజకవర్గంలోకే వస్తాయి. అక్కడ అందరూ ఆయన అభిమానులే ఉంటారు, నిజానికి ఆ అభిమానుల్లో నేను ఓ బాలయ్య అభిమానిని. అలాగే ఇందులో అన్నిటినీ ఒరిజినల్ బాలయ్య అభిమానిలానే చేసాను.
అభిమానిలా ఆయన్ని అతిథి పాత్రలో చూపించాలనుకోలేదా?
మొదట్లో.. అతిథి పాత్ర చేయించాలని అనుకున్నాం. కానీ ఆయన అతిథి పాత్ర సినిమాలోని మెయిన్ పాయింట్‌ని పక్కకి తీసుకెళ్తుందేమో అని మళ్ళీ వద్దనుకొని వెనక్కి తగ్గాం.
బాలకృష్ణ ఎలా ఫీలయ్యారు?
ఈ సినిమా గురించి తెలుసుకొని బాలకృష్ణ గారు బాగా ఎగ్జైట్ అయ్యారు. ఏంటయా!. సినిమాలో నా అభిమానిగా నటిస్తున్నావంట కదా! అనడిగారు. నేను హిందూపూర్‌లో ఉన్నప్పుడు షూటింగ్ జరిగితే చెప్పు. ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే ఆయన చూస్తారు. అందరికి నచ్చే సినిమా. బాలయ్య ఫ్యాన్స్‌కి ఈ సినిమా బోనస్‌గా ఉంటుంది.
మీకు నచ్చే నటులు ఎవరు?
నాకు రియల్ లైఫ్‌లో నచ్చే నటుడు కమల్ హాసన్. అలాగే, ఏ సినిమాలో ఎవరు బాగా చేస్తే వాళ్ళే నచ్చుతారు.
దర్శకుడు హనుతో పనిచేయడం ఎలా ఉంది?
దర్శకుడు హను నాకు మొదట 'అందాల రాక్షసి' సినిమాలో నటించమని స్టోరీ వినిపించాడు. ఎందుకో నాకు ఆ కథ కనెక్ట్ కాలేదు. నాని సినిమాలా అనిపించలేదు. నన్ను దృష్టిలో పెట్టుకునే హను కథ రాశాడు. ఆ తరువాత కూడా రెండు, మూడు కథలు చెప్పాడు. కాని నా టేస్ట్‌కి ఏది సెట్ కాలేదు. అప్పుడు నాతో కూర్చొని ఎలాంటి సినిమా కావాలని డిస్కస్ చేశాడు. ఆ డిస్కషన్‌లో పుట్టిందే ఈ సినిమా కథ. ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి ఫ్రేం దాకా అతని క్రియేటివిటీనే అని చెప్పాలి. స్క్రిప్ట్ దశలో ఉండగా చాలా విషయాలు ఎలా చేస్తే బాగుండు అనేదాని మీద చర్చించుకున్నాం. కానీ ఒక్కసారి సెట్స్ మీదకి వెళ్ళాక ఇక అంతా అతని వన్ మాన్ షోనే..
భలే భలే మగాడివోయ్ లాభాలు చూసి ఎలా ఫీలయ్యారు?
ఆ సినిమా కలెక్షన్స్, హిట్ రేంజ్ చూసి నేను ఈ రోజుకీ షాక్‌లో ఉన్నాను. నేను ఓ మంచి హిట్ ఫిల్మ్ అవుతుందని అనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్ అని ఊహించనే లేదు.
దీన్నిబట్టి ఇప్పుడు మీరు సినిమాలు ఇంకాస్త జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నారన్నమాట?
ఒకటి అయితే అర్థం చేసుకున్నాను, అదేమిటంటే ప్రేక్షకులు నా దగ్గర నుంచి కొంత ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందుకే ఒకటి ఫిక్స్ అయ్యా, ఇకనుంచి నేను చేసే సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉండేలానే ఎంచుకుంటాను, అలాగే సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా సమంగా ఉండేలా చూసుకుంటాను.
రెమ్యునరేషన్ పెంచారటగా?
నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేప్పుడు మొదటిసారి రూ. 2500 జీతం తీసుకున్నాను. ఆ తరువాత రూ.3500 తీసుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే రెమ్యునరేషన్ పెంచారు. యాక్టర్ అయ్యాకా పెంచనా అంటూ.. నవ్వుతూ చెప్పారు.
మణిరత్నం సినిమా వుందా?
మణిరత్నం గారి సినిమాలో నటించాలనుకున్నాను. కాని ఆ సినిమా కథ ఒక హిందీ సినిమా కథకు దగ్గరగా ఉందని ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన వేరే స్క్రిప్ట్ పనిలో ఉన్నారు.
తదుపరి సినిమాలు?
మొదట నాకు బ్రేక్ ఇచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా షూటింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా డైరెక్టర్‌తో ఓ సినిమా ఉంటుంది అని చెప్పారు.