శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 26 డిశెంబరు 2016 (21:41 IST)

ఆ విషయంలో నాకు ధైర్యం లేదు : అల్లరి నరేష్‌ ఇంటర్వ్యూ

''నా నుంచి ప్రతివారూ హాస్యాన్ని కోరుకుంటారని... ప్రయోగాలు పేరుతో సెంటిమెంట్‌, యాక్షన్‌ చిత్రాలు చేసినా ఎవ్వరూ చూడటం లేదని'' అల్లరి నరేష్‌ తెలిపారు. ఆయన నటించిన చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 'ఛత్ర

''నా నుంచి ప్రతివారూ హాస్యాన్ని కోరుకుంటారని... ప్రయోగాలు పేరుతో సెంటిమెంట్‌, యాక్షన్‌ చిత్రాలు చేసినా ఎవ్వరూ చూడటం లేదని'' అల్లరి నరేష్‌ తెలిపారు. ఆయన నటించిన చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 'ఛత్రపతి' నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 30న విడుదల సందర్భంగా నరేష్‌ చెప్పి విశేషాలు.
 
ఈమధ్య సినిమాలు తగ్గించారే?
'సెల్ఫీరాజా' తర్వాత సినిమాలను ఆచితూచి చేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చిన ప్రతికథను చేయలేం. క్వాలిటీ కోసం తీసుకునే జాగ్రత్తల్లో కాస్త ఆలస్యం కావచ్చు.
 
మోదీ నోట్ల రద్దు ప్రభావం ఎలా వుంది?
ముందుగా అనుకున్నట్లు నవంబర్‌ 12న విడుదల కావాలి. కానీ మోదీగారు 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు ప్రకటించడంతో మా సినిమాను ఆపేశాం. అందరూ నోట్లకోసం బ్యాంకుల చుట్టూ తిరగడంతోపాటు వున్న నోట్లను జాగ్రత్తగా వాడుకునేవిధంగా యువత ఆలోచించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఇటీవల విడుదలైన చిత్రాలు బాగానే ఆడుతున్నాయి.
 
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది?
పెళ్లిళ్లకు బ్యాండ్‌ వాయించే వ్యక్తిగా నటించాను.
 
అసలు కథేమిటి?
బ్యాండ్‌ వాయిస్తూ ఓ పెండ్లి ఇంటికి వెళతాను. దెయ్యాలంటే నమ్మని నేను అక్కడ అనుకోకుండా ఓ దెయ్యం వుండే చోటులో ఇరుక్కుంటాను. పెండ్లి ఇంటికి దెయ్యం వస్తే? ఏమిటనేది అసలు కథ.
 
నాగేశ్వరరెడ్డితో చేయడానికి కారణం?
ఈ కథను 2014 నవంబర్‌లో అనుకున్నాం. సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు ఆయనతో చేశాను. ఆ తర్వాత ఈ కథ నచ్చి ఈ సినిమా చేశాను.
 
దెయ్యాన్ని భయపెట్టారా? భయపడ్డారా?
దేవుడ్ని నమ్మే నేను.. దెయ్యాన్ని వదిలించే చిత్రమైన పరిస్థితి వస్తుంది. అందుకే ఏదో మంత్రాలు చదువుతున్నట్లు.. ఓం శాంతి.. మనశ్శాంతి. విజయశాంతి..' అంటూ మంత్రాల్లా వల్లిస్తాను. అది చూసేవారికి ఎంటర్‌టైనింగ్‌ వుంటుంది.
 
'సుడిగాడు' సినిమా ఏం నేర్పింది?
ఆ చిత్రం మంచితో పాటు చెడునూ చేసింది. అది నాకు మగధీరలా తయారైంది. ఏ కథలు వచ్చినా అన్నింటిలోనూ ఆ తరహా పాత్రలే వచ్చేవి. సెంటిమెంట్‌ వున్నా.. దాన్ని కామెడీగా చేయాలి. ఎన్నో కథలు విన్నాను. కథలో కామెడీ వుండాలి. కామెడీ కోసం కథ వుండకూడదని తెలుసుకున్నాను.
 
మళ్లీ స్పూఫ్స్‌ చేస్తారా?
'సుడిగాడు' తర్వాత ఇక చేయకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్‌ జరిగినా, ఆఖరికి అవార్డు ఫంక్షన్లలోనూ స్పూఫ్స్‌ చేసేస్తున్నారు. ఇలాంటి స్పూప్స్‌ నాకంటే ముందు ఎందరో చేశారు. నేను సుడిగాడు చేశాక ప్రభావం నాపై పడింది. అందుకు ఇకపై స్పూఫ్‌ చేయను.
 
ఇంట్లో దెయ్యం.. టైటిల్‌ ఎవరు నిర్ణయించారు?
రచయిత బండి రమేష్‌ టైటిల్‌ పెట్టాడు. ఇలాంటివి 30 కథలు విన్నాక.. ఆఖరికి ఈ కథ విన్నాను. దీనికి స్ఫూర్తి మనం నానుడిగా వుపయోగించే 'చెట్టుమీద దెయ్యం నాకేం భయం..' అనే దాన్నుంచి తీసుకున్నాడు. దాన్ని ఇలా టైటిల్‌గా మార్చేశారు.
 
చేసేటప్పుడు భయపడ్డారా?
ఆర్టిస్టుగా, ప్రేక్షకుడుగా భయపెట్టకూడదని అనుకుంటాను. కానీ మనలో తెలీని శాడిజమే భయం. ఎదుటివాడు భయపడుతూ వుంటే ఎంజాయ్‌ చేస్తూ ఆనందిస్తాం. 
 
రొమాన్స్‌కు అవకాశం వుందా?
అసలు రొమాన్స్‌ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి పాత్రలోనూ దెయ్యం ఆవహించి వుందని తెలుసు. ఎప్పుడు ఏ పాత్ర ఎలా రియాక్ట్‌ అవుతుందో తెలీదు.
 
భారీ నిర్మాణ సంస్థలో చేయడం ఎలా అనిపించింది?
బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ గారు నిర్మాణ వాల్యూస్‌ బాగున్నాయి. ఆయన పెద్ద సినిమాలు చేశారు. చిన్న సినిమా చేయాలని నాతో చేశాను.  నాన్నకు ఫ్యామిలీ మెంబర్‌ ఆయన. సినిమా షూటింగ్‌కు వచ్చినప్పుడల్లా.. మనం కొడుతున్నాం అనేవారు. ఏం కొడుతున్నాం సార్‌! అంటే.. హిట్‌.. అనేవారు. ఆయన మొదటి నుంచి పాజిటివ్‌తోనే వున్నారు.
 
ప్రయోగాత్మక చిత్రాలు చేయరా?
గమ్యం, శంభో శివశంభో.. వంటి చిత్రాలు చేశాను. అవి కూడా నిర్మాత, దర్శకుల అభిరుచి మేరకే చేశాను. నాకూ చేయాలనుంటుంది. అయితే నానుంచి కామెడీనే కోరుకుంటున్నారు. వేరే చేస్తే చూడ్డంలేదు. అందుకే ప్రయోగాలు చేసేందుకు ధైర్యం చాలడంలేదు. నా దృష్టిలో వాటికంటే కామెడీ చేయడమే కష్టం.
 
వ్యక్తిగతంగా బాధ్యత పెరిగిందా?
పెండ్లయ్యాక కంటే పిల్లలు పుట్టాక బాధ్యత పెరిగింది.
 
సెట్లో ఏవైనా మార్పులు చేస్తారా?
స్క్రిప్ట్‌ ఓకే అన్నాక మరోసారి ఆలోచించకూడదు. ఏదైనా వుంటే ముందే సరిచేసుకోవాలి. ఇదే నాకు నాన్నగారు చెప్పారు. నేను సెట్లో కథలో ఇన్‌వాల్వ్‌ కాను. ఏవైనా చిన్నపాటి సూచనలు వుంటే చెబుతాను అంతే. మిగతాదంతా దర్శకుడే చూసుకుంటాడు.
 
ఈ ఏడాది సినిమా పరిస్థితి ఎలా వుందంటారు?
మంచి కథలు వస్తే చూడ్డానికి చిన్న సినిమా అని ఆలోచించకుండా పెళ్లిచూపులు వంటి చిత్రాల్ని ఆదరించారు కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారు. 
 
వచ్చే ఏడాది సినిమాలు ఏమైనా వున్నాయా?
ఇప్పటికి మూడు చిత్రాలు లైన్‌లో వున్నాయి. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో, కొత్త డైరెక్టర్‌ సతీష్‌తోనూ సినిమాలు చేయబోతున్నాను. 
 
ఇవివి బేనర్‌లో ఎప్పుడు చేస్తున్నారు?
నాన్నగారికి ఇష్టమైన ప్రాంతం గోదావరి జిల్లాలు. పచ్చటి అందమైన ప్రాంతాల్లో నాన్నగారి బేనర్‌పై వచ్చే ఏడాది సినిమా చేస్తాను. నాన్నగారి పుట్టినరోజున ముహూర్తం పెట్టనున్నాం.
 
దర్శకత్వం ఎప్పుడు చేయబోతున్నారు?
నాన్నగారి కోరిక నేను దర్శకత్వం చేయాలని 2020 మే నెలలో చక్కటి ప్రేమకథతో దర్శకుడిగా కన్పించనున్నా అని తెలిపారు.