గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 30 జనవరి 2017 (21:45 IST)

నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడమే అదృష్టం : నాని ఇంటర్వ్యూ

సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన హీరోగా అందరూ అంటుంటే చాలా ఆనందంగా వుందనీ.. అలా లేకపోవడమే చాలా సంతోషంగా వుందని.. కష్టపడి పైకిరావడం తన పాలసీ అని హీరో నాని తెలిపారు. ఎవరైనా దగ్గరకు వచ్చి మీ ఫ్యాన్‌ను అంటే.. చెప్పలేని ఆనందమేస్తుందని.

సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన హీరోగా అందరూ అంటుంటే చాలా ఆనందంగా వుందనీ.. అలా లేకపోవడమే చాలా సంతోషంగా వుందని.. కష్టపడి పైకిరావడం తన పాలసీ అని హీరో నాని తెలిపారు. ఎవరైనా దగ్గరకు వచ్చి మీ ఫ్యాన్‌ను అంటే.. చెప్పలేని ఆనందమేస్తుందని. ఎందుకంటేవారే అసలైన ఫ్యాన్‌ అని స్పష్టం చేశారు. నాని హీరోగా, కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన సినిమా 'నేను లోకల్‌'. దిల్‌ రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్‌ నిర్మాతగా రూపొందింది. ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడారు.
 
ట్రైలర్‌లో మార్చ్‌ పోతే సెప్టెంబర్‌ అన్నారు.. మీ లైఫ్‌లో కూడా అంతేనా?
(నవ్వుతూ) నేను మార్చి స్టూడెంట్‌ కాదు సెప్టెంబర్‌ కాదు.. అంతకు మించి.
 
సినిమా చేసేప్పుడు మీ కాలేజ్‌ డేస్‌ ఏమైనా.. గుర్తొచ్చాయా? 
కాలేజ్‌ లైఫ్‌ మొత్తాన్ని ఒకసారి చూసినట్లుంది.
 
ఈ వరుసగా ప్రేమకథలే చేస్తున్నారు?
తెలుగులో ప్రేమకథ చుట్టూ ఉండని సినిమా ఉండదు. నా సినిమాలు భలేభలే మగాడివోయ్‌, మజ్ను, ఇప్పుడు 'నేను లోకల్‌' ఇలా ఏ సినిమా చూసుకున్నా ప్రేమకథే మెయిన్‌గా ఉంటుంది. దాని చుట్టూనే మిగతా కథంతా తిరుగుతుంది. ఈ సినిమా కూడా అంతే. బాబు అనే అబ్బాయి కీర్తి అనే అమ్మాయిని ప్రేమించడమే సినిమా. ఈ సినిమాలో నేను లోకల్‌ అనే చిన్న కాన్సెప్ట్‌ ఉంటుంది. అదేంటో సినిమాలో చూడాల్సిందే..
 
మీ పాత్ర ఎలా వుంటుంది?
నా పేరు బాబు. తనకేం అనిపిస్తే అది మాట్లాడేస్తాడు. తన కుటుంబం కూడా అంతే.. వారి ఫ్యామిలీలో నుండి ఫన్‌ క్రియేట్‌ అవుతుంది. బాబు గాడి ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. వాడి ప్రేమ కోసం ఏం చేశాడనేదే కథ. వాడికి లోకల్‌ అనే ఒక్క బలం తప్ప ఇంకేం ఉండదు. అందుకే 'నేను లోకల్‌' అనే టైటిల్‌ పెట్టారు. టైటిల్‌కు న్యాయం చేసేలా ప్రి-క్లైమాక్స్‌లో ఓ సీన్‌ ఉంటుంది.
 
లోకల్‌ అబ్బాయిగా ఎలా చేయగలిగారు.? 
నేను జూబ్లీ హిల్స్‌లో పెరిగి పెద్దయిన వాడిని కాదు. అమీర్‌ పేట్‌, బలకం పేట్‌ ఇలా చాలా మాస్‌ ఏరియాల్లో తిరిగాను. లోకల్‌లో ఉండే మాస్‌ అబ్బాయి ఎలా ఉంటాడని వీడియో చూసి తెలుసుకోక్కర్లేదు. నేనే లోకల్‌.. నా లైఫ్‌‌లో వచ్చిన అనుభవాలతోనే సినిమా చేశాను.
 
ఈసారి మీ సినిమా ఎక్కడ చూస్తున్నారు?
ప్రతి సినిమా ప్రసాద్‌ ఐమాక్స్‌లో రాజమౌళి ఫ్యామిలీతో కలిసి 8:45 షో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం మాస్‌ థియేటర్‌ సంధ్యలోనే, మల్లిఖార్జునలోనో చూడాలనుకున్నాను. అయితే ఇప్పుడు వేరే సినిమా షూటింగ్‌ కోసం అమెరికా వెళ్తున్నాను. పోస్ట్‌‌పోన్‌ చేసుకోవడానికి కుదరదు. ఈసారి సినిమా అక్కడే చూడాల్సి వస్తుంది. మరి ఈసారి అక్కడి ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంటుందో చూడాలి.
 
సినిమా లేట్‌ అవ్వడానికి కారణం? 
నిజానికి ఈ సినిమా డిసంబర్‌ 25న రావాలని ఫిక్స్‌ చేసుకున్నాం. కానీ కీర్తి సురేష్‌ తమిళంలో విజయ్‌ వంటి హీరోలతో పెద్ద ప్రాజెక్ట్స్‌తో బిజీ కావడంతో వారం రోజులు డిలే అయింది. పోస్ట్‌‌ప్రొడక్షన్‌కు టైమ్‌ దొరకలేదు. సినిమాకు ఆర్‌.ఆర్‌ చాలా ముఖ్యం. దేవిశ్రీ ప్రసాద్‌ మీద మీద ప్రెషర్‌ పెడితే ఔట్‌‌పుట్‌ పైన ఎఫెక్ట్‌ పడుతుందని టైమ్‌ తీసుకొని చేశాం. ఎలాంటి రీషూట్స్‌ చేయలేదు.
 
సినిమా టైంలో టెన్షన్‌ గురవుతారా? 
నటుడిగా నాకు డబ్బు, ఫేమ్‌ ముఖ్యం కాదు. మనం చేసిన ప్రొడక్ట్‌ ప్రేక్షకులు చూడబోతున్నారనే ఎగ్జైట్మెంట్‌ ఉంటుంది. అది వాళ్ళకు నచ్చిందో.. లేదో.. సెకండరీ కానీ నేను చేసిన ప్రాజెక్ట్‌ చూడబోతున్నారనే ఫీలింగ్‌ను నేను ఎంజాయ్‌ చేస్తాను. నటుడిగా సినిమా రిలీజ్‌ అయ్యే ముందు నాలుగు రోజులు టెన్షన్‌గా వుంటాను.
 
కొత్త దర్శకులతో పని చేయడం ఎలా అనిపిస్తుంటుంది..? 
నన్ను చాలామంది స్టార్‌ హీరోలతో ఎందుకు పనిచేయడం లేదని అడుగుతుంటారు. అప్పుడు వాళ్ళకి నేను ఫ్యూచర్‌ స్టార్‌ డైరెక్టర్స్‌తో పని చేస్తున్నానని చెప్తూ ఉంటాను. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తే ఔట్‌‌పుట్‌ కూడా కొత్తగా వస్తుంది. వాళ్ళను నేనే పరిచయం చేశాననే ఫీలింగ్‌ కూడా ఉంటుందనుకోండి.
 
సేఫ్‌ జోన్‌లో ఉన్న హీరోల్లో మీరొకరని అన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? 
చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఎంత పెద్ద సక్సెస్‌ఫుల్‌ మూవీ అయినా ఒక్కడో ఒకచోట ఎగ్జిబిటరో, థియేటర్‌ ఓనరో లాస్‌ అయిపోయుంటాడు. కానీ నా సినిమాకు నిర్మాత నుండి థియేటర్‌ ఓనర్‌ వరకు అందరూ సేఫ్‌గా ఉన్నారంటే ఆనందంగానే ఉంటుంది. మన సినిమాల వల్ల నిర్మాతలు లాభపడుతున్నారు అంటే అంతకుమించిన సక్సెస్‌ లేదు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి.
 
బ్యాక్‌‌గ్రౌండ్‌ లేకుండా ఈ పొజిషన్‌లో ఉండటం గ్రేట్‌ అనేప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? 
నా దృష్టిలో బ్యాక్‌‌గ్రౌండ్‌ లేకపోవడాన్ని మించిన అదృష్టం మరొకటి లేదు. ఎవరైనా వచ్చి నేను మీ అభిమానిని అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నా అభిమానే అనే ఫీలింగ్‌ కలుగుతుంది.
 
రెమ్యూనరేషన్‌ పెంచేస్తున్నారే? 
నేను పెంచడం లేదండీ.. నిర్మాతలే పెంచుతున్నారు.
 
సన్నబడినట్లు ఉన్నారు? 
స్పెషల్‌గా ఏం చేయలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాను కదా అందుకేనేమో..
 
డైరెక్షన్‌ ఎప్పుడు చేస్తారు? 
ఇప్పుడు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్షన్‌ చేయాలనుకోవడం అంటే... అంతకుమించి రాంగ్‌ డెసిషన్‌ మరొకటి ఉండదు.
 
తదుపరి చిత్రాలు? 
దానయ్యగారు బేనర్‌లో శివ అనే కొత్త డైరెక్టర్‌‌తో సినిమా చేస్తున్నాను. అలాగే దిల్‌ రాజుగారి బ్యానర్‌లో కూడా ఓ సినిమా చేస్తాను. ఈ ఏడాది మూడు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పారు.