గురువారం, 29 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: గురువారం, 11 డిశెంబరు 2014 (21:40 IST)

దర్శకురాలిగా నిరూపించుకుంటా : ఎంఎస్ కుమార్తె శశికిరణ్‌

సినిమా రంగంలో వారసత్వం అటు మగవారికే కాకుండా ఆడవారికి వుంది. మోహన్‌ బాబు కుమార్తె నటి అయినట్లే... పలువురు ప్రముఖుల వారసులు 24 క్రాఫ్ట్స్‌లో తమ అభిరుచి మేరకు రాణిస్తున్నారు. రాజమౌళి భార్య రమా, శ్రీను వైట్ల భార్య, కోన వెంకట్‌ సోదరి వీరంతా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే దర్శకత్వంలో విజయనిర్మల తర్వాత మహిళలు తక్కువనే చెప్పాలి. 
 
జీవిత రాజశేఖర్‌ వచ్చినా మరలా గ్యాప్‌ ఇచ్చారు. తాజాగా నటుడు ఎం.ఎస్‌. నారాయణ కుమార్తె శశికిరణ్‌ నారాయణన్‌ దర్శకురాలిగా మారారు. ఆమె దర్శకత్వం వహించిన చిత్రం 'సాహెబా సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. దిలీప్‌, ప్రియాల్‌ నాయకానాయికలు. డా. కొల్లా నాగేశ్వరరావు నిర్మించారు. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...
 
దర్శకురాలిగా మారడానికి స్పూర్తి ఎవరు? 
నేను ఈవెంట్‌ మేనేజర్‌గా పలు ప్రోగ్రామ్‌లు చేసేదాన్ని. మా టీవీలో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా నిర్వహించాను. నా ఎయిమ్‌ దర్శకత్వం. అయితే దీనికి పునాది చిన్నతనంలో పడిందని చెప్పాలి. నాన్నగారు పలు నాటకాలు రాస్తూ, దర్శకత్వం వహించేవారు. ఆయన నటుడిగాకంటే దర్శకుడిగా అప్పట్లో పెద్ద పేరు వుండేది. రాజమండ్రి చుట్టుప్రక్కల నాన్నగారి దర్శకత్వం కోసం చాలా మంది వచ్చేవారు. అక్కడే నాకు పునాది పడిందని చెప్పగలను.
 
'సాహెబా సుబ్రహ్మణ్యం' అంటే ఏమిటి? 
సాహెబా అనేది ముస్లిం యువతి పేరు. సుబ్రహ్మణ్యం అనేది తెలుగు అబ్బాయి పేరు. ఇద్దరూ ప్రేమించుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది చెప్పడం జరిగింది.
 
ఈ తరహా కథలు గతంలో వచ్చాయి కదా? ఇందులో ప్రత్యేకతేమిటి? 
ఇది ఓ మలయాళ చిత్రం రీమేక్‌. అక్కడ ఘనవిజయం సాధించింది. ఒక సింపుల్‌ సెన్సిబుల్‌ మ్యూజికల్‌ లవ్‌స్టోరీ. విజువల్‌గా అందంగా వుంటుంది. మలయాళ రీమేక్‌ అయినా.. మన నేటివిటీకి తగ్గట్లు చిన్నచిన్న మార్పులు చేర్పులతో కథను తీర్చిదిద్దాం. ఒరిజినాలిటీ చెడకుండా ఓ అందమైన కథని అందంగా చూపించాలనుకున్నా. అదే చేశాను. నాయకానాయికలు చాలా అద్భుతంగా నటించారు. ప్రియాల్‌ పంజాబీ అమ్మాయి. ముంబైలో ఆడిషన్స్‌ చేసి మరీ ఎంపిక చేసుకున్నాం. సాయిప్రకాష్‌ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.
 
అసలు దర్శకురాలిగా అవకాశం ఎలా వచ్చింది? 
టీవీమాధ్యమంలో వుండగానే నాతోపాటు పనిచేసే స్నేహితుడు వేణు. తను 'సీతావలోకనం' చిత్రానికి దర్శకత్వం కూడా చేశారు. ఆయన ద్వారా వచ్చింది. తొలుత చిత్ర నిర్మాత నాగేశ్వరరావు మహిళా దర్శకురాలు ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని భావించి వేణుకి చెప్పారు. తను నా పేరు సూచించాడు. అలా అవకాశం వచ్చింది. 
 
దర్శకత్వంలో మెళకువులు నేర్చుకున్నారా? 
పలువురి దర్శకత్వాన్ని పరిశీలించాను. ఎవరి దగ్గర చేయలేదు. దర్శకురాలు అవడం నా లక్ష్యం. అయినా నాకు ఈ రంగంలో అనుభవంలేదు. టీవీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా వున్న అనుభవం, ప్యాషన్‌తో అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగాను. నిర్మాత, సాంకేతిక నిపుణుల సహకారం మరువలేనిది. నాన్నగారు దర్శకరచయిత, తర్వాత నటుడయ్యారు. లెక్చరర్‌గా ఉన్నప్పుడే నాటకాలు వేయించేవారు. అప్పటి నుంచి ఇంట్లో ఆ వాతావరణం అలవడింది. అందుకే ఇంత సులువుగా నేను దర్శకత్వం చేయగలిగాను.
 
దర్శకత్వంలో ప్రేరణ ఎవరు? 
దర్శకత్వంలో స్పూర్తి మణిరత్నం. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ వీరి చిత్రాలన్నీ చూస్తాను.. పట్టుదల వుంటే సాధ్యం కానిది లేదు. అదే నన్ను దర్శకురాలిగా నడిపించింది.
 
ఈ చిత్రం చూశాక మీ నాన్నగారి స్పందన ఏమిటి? 
చాలా బాగా తీశావ్‌ అన్నారు. ఎందుకంటే ఒరిజినాలిటీ ఎక్కడా మిస్‌ కాకుండా వుంది. నిన్ను ఈ చిత్రం నిలబెట్టాలని దీవించారు.
 
నిర్మాత నుంచి ఎటువంటి సపోర్ట్‌ వచ్చింది? 
నిర్మాతే లేనిదే సినిమాలేదు. ఇక్కడో విషయం చెప్పాలి. చాలా సినిమాలు తీస్తున్నారు. విడుదలకు చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కానీ ఈ సినిమాకు ఆయన లండన్‌ నుంచి వచ్చి... పట్టుదలతో విడుదల చేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు వచ్చాయి. చాలా సినిమాలు విడుదలలు వున్నాయి. మల్టీప్లెక్స్ వంటి థియేటర్లలో ఒక్క షో మాత్రమే అవకాశం లభించింది.
 
స్వంత కథలు రాసుకున్నారా? 
నాకు ప్రయాణంలో జరిగే సంఘటనలు నేపథ్యంగా చిత్రాలంటే ఇష్టం. అటువంటి స్టోరీని రాసుకున్నాను. అదృష్టం కలిసివస్తే తర్వాత అటువంటి చిత్రాన్ని రూపొందిస్తాను అని చెప్పారు.