సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (10:42 IST)

ఐపీఎల్ సీజన్ 12 : బోణీ ఎరుగని బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ పన్నెండో సీజన్‌ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు అస్సలు ఏమాత్రం కలిసిరానట్టుగా లేదు. తొలి పోరు చెన్నైతో మొదలుపెడితే.. ఆదివారం ఢిల్లీ వరకు బెంగళూరుది గెలుపనేది ఎరుగలేదు. ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. 
 
బెంగుళూరు జట్టు నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఒక పరుగుకే ఓపెనర్ ధవన్(0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (50 బంతుల్లో 67, 8ఫోర్లు, 2సిక్స్‌లు), పృథ్వీషా(28)కు జతకలిశాడు. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ పార్థివ్‌పటేల్ క్యాచ్ విడిచిపెట్టడంతో అయ్యర్ బతికి బయటపడ్డాడు. 
 
మరోవైపు పృథ్వీషా.. సౌథీ మూడో ఓవరులో వరుసగా నాలుగు ఫోర్లతో దుమ్ముదులిపాడు. ఖచ్చితమైన ప్లేస్‌మెంట్స్‌తో షా సూపర్ షాట్లతో అలరించాడు. బంతి అనుకున్న రీతిలో బ్యాట్‌పైకి రాకపోయినా.. ఓపిక వహిస్తూ అడపాదడపా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే పూర్తయ్యే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను షాను ఔట్ చేయడం ద్వారా నేగి దెబ్బతీశాడు. దీంతో రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
 
 ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్రామ్‌తో కలిసి అయ్యర్ కీలకమైన భాగసామ్యం నెలకొల్పాడు. ఆలీ బౌలింగ్‌లో ఇంగ్రామ్ ఔట్ కాగా, ఈ క్రమంలో అయ్యర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే క్రీజలో కుదురుకున్న అయ్యర్‌తో పంత్ జోడీ కట్టాడు. వీరిద్దరు బెంగళూరు బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టారు. లక్ష్యం సమీపిస్తున్న సమయంలో రెండు పరుగుల తేడాతో అయ్యర్, మోరిస్(0), పంత్ వికెట్లు కోల్పోయిన ఢిల్లీని అక్షర్ పటేల్, తెవాటియా గెలుపు తీరాలకు చేర్చారు. 
 
అంతకుముందు.. ఆర్బీసీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రాణించినప్పటికీ విజయాన్ని అందుకోలేక పయారు. ఆ జట్టులో పార్థివ్‌పటేల్ 9, కోహ్లీ 41, డివిలీయర్స్ 17, స్టోయినిస్ 15, అలీ 32, నాథ్ 19, నేగి 0, సౌథి 9 నాటౌట్, సిరాజ్ 1, చాహల్ 1 నాటౌట్ చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగులు రూపంలో 5 రన్స్ వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.