ఓడినా ఏం పర్లేదు.. చేపాక్‌లో చూసుకుంటాం.. ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ మార్చి 23వ తేదీ ప్రారంభమైంది. ఈ పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడింది.
తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ క్రమంలో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు సాధించింది.
ముంబై క్రికెటర్లలో సూర్యకుమార్ యాదవ్ అత్యధికంగా 59 పరుగులు సాధించాడు. ఇక 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ అంబటి రాయుడు తొలి బంతికే అవుటై షాకిచ్చాడు. తదనంతరం బరిలోకి దిగిన సురేష్ రైనా 16 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఆపై జోడీ కట్టిన కేదార్ జాదవ్, ధోనీ నిలకడగా ఆడింది.
అయినా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 133 పరుగులే సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కేదార్ జాదవ్ 58 పరుగులు సాధించాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం ద్వారా 100 ఐపీఎల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్ ఓటమికి అనంతరం మాట్లాడిన ధోనీ.. ఫీల్డింగ్, బౌలింగ్ చెత్తగా చేశామన్నాడు. బౌలింగ్ బాగా పరుగులు ఇచ్చేశాం. బ్రావోకు గాయం జట్టుకు మైనస్సేనని.. అతని స్థానంలో తగిన ఆటగాడు లేకపోవడం ఓటమికి కారణమైందని ధోనీ చెప్పుకొచ్చాడు. అయినా ఏం పర్లేదు.. తదుపరి మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగుతోంది. అక్కడ చూసుకుంటామని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు.