గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (09:55 IST)

భళా బెంగళూరు భళా: విరాట్ కోహ్లీ 10,000 పరుగులు పూర్తి

RCB
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. ఇందులో బెంగళూరు 11, ముంబై 17 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇటీవలి కాలంలో ముంబైపై బెంగళూరు ఎక్కువగా విజయాలు అందుకోలేదు. రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు ఘోరంగా ఓడిపోయాయి. 
 
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గతంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. అందులో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఐపీఎల్ 2021లో అన్ని విభాగాల్లో రెండు జట్లు బలంగా ఉన్నా.. విజయాలు మాత్రం అందుకోవట్లేదు. ముఖ్యంగా ముంబై. అందుకే ఈ మ్యాచులో ముంబై గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది. మరోవైపు బెంగళూరు కూడా ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ మార్గాన్ని మరింత సులువు చేసుకోవాలని చూస్తోంది. 
 
ఇకపోతే.. టీమిండియా సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 10,000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడంతో కోహ్లీ టీ20ల్లో 10,000 పరుగులు పూర్తిచేశాడు. టీమిండియా (టీ20 మ్యాచులు), ఢిల్లీ (దేశీయ క్రికెట్), బెంగళూరు (ఐపీఎల్) జట్లకు ఆడుతూ కోహ్లీ పదివేల రన్స్ చేశాడు.
 
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ ముందున్నాడు. యూనివర్స్ బాస్ 446 మ్యాచ్‌లలో 22 సెంచరీలు మరియు 87 అర్ధ సెంచరీలతో 36.94 స్ట్రైక్ రేట్‌తో 14,261 పరుగులు చేశాడు. 
 
ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ 561 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ మరియు 56 అర్ధ సెంచరీలతో 11159 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 436 మ్యాచులో 10808 పరుగులుతో మూడో స్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో మాలిక్ 66 అర్ధ సెంచరీలు చేశాడు. హుదెరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 304 మ్యాచ్‌ల్లో 10017 పరుగులతో టాప్-4లో నిలిచాడు.