1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:16 IST)

రాజస్థాన్ రాయల్స్ వండర్స్.. చివరి ఓవర్‌లో గెలుపు

ఐపీఎల్ 14 రెండో సీజన్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ ఎలెవెన్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ వండర్స్ చేసింది. చివరి ఓవర్‌లో రెండు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. పంజాబ్ ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్ 67, కేఎల్ రాహుల్ 49 ప‌రుగులు చేసినా జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌లేక‌పోయారు. 
 
కానీ, చివరి ఓవర్‌లో పంజాబ్‌ విజయానికి నాలుగు పరుగులు అవసరం. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్‌ కార్తీక్‌ త్యాగి అద్భుతంగా బౌలింగ్‌తో రెండు వికెట్లు తీసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. 
 
తొలి నుంచి పంజాబ్‌ విజయం దిశగా సాగినా చివరి ఓవర్‌లో అంతా మారిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 185 ప‌రుగులు చేసి.. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ముందు 186 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 19 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 
 
ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగా చేతిలో బోల్డన్ని వికెట్లు ఉన్నాయి. కావాల్సింది నాలుగు పరుగులు. ఈ సమయంలో ఎవరైనా పంజాబ్‌ సునాయాసంగా గెలుస్తుందని భావిస్తారు. అంతేకాదు, పంజాబ్ శిబిరంలో సందడి వాతావరణం కూడా నెలకొంది. కానీ అక్కడే అద్భుతం జరిగింది. 
 
కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్ తొలి బంతికి పంజాబ్‌కు పరుగేమీ రాలేదు. రెండో బంతికి ఓ పరుగు వచ్చింది. ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయానికి మూడు పరుగులు కావాలి. కానీ, మూడో బంతికి పూరన్ అవుటయ్యాడు. దీంతో పంజాబ్ శిబిరంలో ఉత్కంఠ. అయినా, ఇంకా మూడు బంతులు మిగిలి ఉన్నాయి కాబట్టి గెలుపుపై పంజాబ్ ధీమాగా ఉంది. 
 
కార్తీక్ త్యాగి వేసిన నాలుగో బంతికి పరుగేమీ రాలేదు. దీంతో టెన్షన్ మరింత పెరిగింది. ఐదో బంతికి మళ్లీ వికెట్. దీంతో పంజాబ్ డగౌట్లో కలవరం. ఇక, చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా కార్తీక్ సంధించిన చివరి బంతికి పరుగేమీ రాలేదు. దీంతో అనూహ్యంగా రాజస్థాన్‌ను విజయం వరించింది. విజయం అందినట్టే అంది చేజారడంతో పంజాబ్ శిబిరంలో నిర్వేదం నిండుకుంది. ప్రేక్షకులకు ఈ మ్యాచ్ ఐపీఎల్‌లోని అసలైన అనుభూతిని పంచింది.
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లు ఆది నుంచే విరుచుకుపడ్డారు. రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ స్కోరు తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. లూయిస్ (36), జైశ్వాల్ (49), లివింగ్ స్టోన్ (25) క్రీజులో ఉన్నంత సేపు పరుగులు ధారాళంగా వచ్చాయి. 
 
ఇక లోమ్రోర్ అయితే చెలరేగిపోయాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. అర్షదీప్ బౌలింగ్‌కు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ తలవంచారు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశాడు. షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు.
 
అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ (49), మయాంక్ అగర్వాల్ (67) చెలరేగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురైన పంజాబ్ చేజేతులా వికెట్లు పారేసుకుని అనూహ్యంగా ఓటమి పాలైంది. మార్కరమ్ అజేయంగా 26 పరుగులు చేయగా పూరన్ 32 పరుగులు చేశాడు. 
 
రాజస్థాన్ బౌలర్లలో త్యాగి రెండు వికెట్లు తీసుకోగా, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీసుకున్నారు. చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించి పెట్టిన కార్తీక్ త్యాగికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో 5వ స్థానానికి చేరుకోగా, పంజాబ్ కింది నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.