సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:44 IST)

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌పై సైబర్ దాడి... ర్యాన్సమ్ వేర్‌తో అటాక్

దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్‍‌డౌన్ అమలవుతోంది. దీంతో అనేక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని కల్పించాయి. అయితే, సైబర్ నేరగాళ్ళకు ఇపుడు ఇదే ఓ అవకాశంగా దొరికింది. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) సైబర్ దాడికి గురైంది. 
 
ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది ఉద్యోగులతో 15 బిలియన్ డాలర్ల సంపదతో అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్న ఈ సంస్థ అంతర్గత కంప్యూటర్ వ్యవస్థలపై శుక్రవారం రాత్రి సైబర్ దాడి జరిగిందని, హ్యాకర్లు ర్యాన్సమ్ వేర్‌ను చొప్పించారని కాగ్నిజెంట్ వర్గాలు వెల్లడించాయి. దీన్ని మేజ్ ర్యాన్సమ్ వేర్ అటాచ్ మెంట్‌గా కాగ్నిజెంట్ పేర్కొంది. ఈ దాడి కారణంగా వినియోగదారుల సేవలకు కొంత అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. 
 
అయితే, ఈ సైబర్ దాడి పర్యవసానాలను ఎదుర్కొనేందుకు తమ భద్రత నిపుణుల బృందం రంగంలోకి దిగిందని, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దీనిపై సమాచారం అందించామని వివరించింది. అంతేకాకుండా, సైబర్ దాడి విషయాన్ని తమ వినియోగదారులకు వెల్లడించామని, తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యలను వారికి తెలియజేశామని కాగ్నిజెంట్ ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది.