మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:58 IST)

ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన కేంద్రం... ప్రతినిధులు అరెస్టు తప్పదా?

ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్విట్టర్‌కు కేంద్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తమ ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. గతంలో 1178 అకౌంట్లను బ్లాక్ చేయాల‌ని జారీ చేసిన ఆదేశాల‌కు సంస్థ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దీనిపై కేంద్ర వర్గాలు స్పందిస్తూ, సంస్థ అంత‌ర్గ‌త చ‌ట్టాలు ఏవైనా ఉండ‌ని.. దేశ‌ చ‌ట్టాల‌ను పాటించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తమ సహనం నశిస్తోందని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేషన్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

ట్విట్టర్ అధినాయ‌క‌త్వంపై ఆ శాఖ కార్య‌ద‌ర్శి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇండియాలో రాజ్యాంగం, స్థానిక చ‌ట్టాలే సుప్రీం. బాధ్య‌తాయుత సంస్థ‌లు ఖచ్చితంగా స్థానిక చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే అని ఆ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. 

ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబ‌ల్ ప‌బ్లిక్ పాల‌సీ మోనిక్ మెచె, డిప్యూటీ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ జిమ్ బేక‌ర్‌ల‌తో ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి వ‌ర్చువ‌ల్ మీటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ప్ర‌భుత్వం 1178 ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించింది. 

కానీ, ట్విట్టర్ మాత్రం కేవ‌లం 500 అకౌంట్ల‌నే బ్లాక్ చేసింది. మిగ‌తా అకౌంట్ల‌ను భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ పేరుతో అలాగే ఉంచింది. అవ‌స‌ర‌మైతే దీనిపై కోర్టుకు వెళ్లాల‌ని కూడా ట్విట్టర్ భావిస్తోంది. దీంతో కేంద్రం మండిపడింది.