శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (16:14 IST)

దేశంలో 5జీ ట్రయల్స్ షురూ - ఒక మెగాహెడ్జ్ ధర రూ.492 కోట్లు!!

వచ్చే యేడాది ఆఖరు నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే 5జీ ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ ట్రయల్స్ త్వరలోనే పూర్తి చేసి 2020 నాటికి అందుబాటులోకి తీసుకునిరావాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు.. టెలికాం శాఖ భావిస్తోంది. 
 
నిజానికి ఈ 5జీ సేవలు ఒక్క భారత్‌లో మినహా మిగిలిన ప్రపంచ దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో మాత్రం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇదే అంశంపై కేంద్ర టెలికాం శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ, వచ్చే యేడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో 5జీ వేలం ఉంటుందని సూచన ప్రాయంగా వెల్లడించారు. దీంతో టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి.
 
2020 చివరి వరకు దేశమంతటా 5జీ సేవలు విస్తరించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారని గుర్తుచేశారు. అదుకే టెలికాం విభాగం 5జీ ప్రక్రియపై వేగం పెంచిందనీ, అందులో భాగంగానే వీలైనంత త్వరగా 5జీ వేలం నిర్వహించేందుకు టెలికాంశాఖ సన్నద్ధమవుతోందని తెలిపారు. 
 
అలాగే, 5జీ ధరపై ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, 5జీ రేడియో తరంగాల 1 మెగాహెడ్జ్ ఎయిర్ వేవ్స్‌ కనీస ధర రూ.492 కోట్లుగా ఉంటుందని సూచనప్రాయంగా చెప్పారు. ఈ క్రమంలోనే తొలుత కనీసం 20 మెగాహెడ్జ్ బ్లాకులను వేలంలో విక్రయిస్తారని తెలుస్తోంది. ఇక మొత్తం 8,293.95 మెగాహెడ్జ్ 4జీ, 5జీ స్పెక్ట్రంను వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి రూ.5.86 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని సమాచారం.