వినాయక చవితికి జియోఫోన్ నెక్ట్స్.. రెండు మోడల్స్.. ధరల వివరాలివే..
వినాయక చవితి పర్వదినమైన సెప్టెంబరు 10న స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్‌ను విడుదల చేయనున్నారు. జియో-గూగుల్ భాగస్వామ్యంలో ఈ ఫోన్ లాంఛ్ కానుంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే అని ప్రకటించడంతో.. దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి నెట్‌లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
జియోఫోన్ నెక్ట్స్ ధరకు సంబంధించిన వార్తలు నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ధర విషయంలో రిలయన్స్ సరికొత్త వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రెండు మోడళ్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి రూ.5,000 కాగా.. మరొకటి రూ.7,000 అని నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. అయితే, వీలైనంత ఎక్కువ మందికి ఈ ఫోన్లను చేర్చేందుకు జియో ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా మొత్తం ధరలో కేవలం 10 శాతం అంటే.. ఒక మోడల్‌కు రూ.500, మరో మోడల్‌కు రూ.700 చెల్లిస్తే ఫోన్‌ని సొంతం చేసుకునేలా ఓ ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు సమాచారం. ఇష్టమైతే వినియోగదారులు ఎక్కువ కూడా చెల్లించొచ్చని తెలుస్తోంది.
ఇటీవలే జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉందని నెట్‌లో ఓ టిప్‌స్టర్ ఇచ్చిన సమాచారం చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇటు జియోగానీ, అటు గూగుల్‌గానీ ఫోన్ ధర, ఫీచర్లపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.