శనివారం, 22 నవంబరు 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (17:06 IST)

వాట్సాప్‌లో భద్రతా లోపం.. గుర్తించిన వియన్నా వర్సీటీ పరిశోధకులు

Whatsapp
ప్రముఖ సామాజిక మాధ్యమమైన వాట్సాప్‌లో భద్రతా లోపం ఉన్నట్టు వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఈ లోపం కారణంగా కోట్లాది మంది వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ మొబైల్ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, ఇదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా చౌర్యంగా మిగిలిపోతుందని వారు హెచ్చరించారు. 
 
సాధారణంగా ఎవరిదైనా ఫోన్ నంబరును మన ఫోనులో సేవ్ చేయగానే, వారు వాట్సప్‌‌లో ఉన్నారో లేదో సులభంగా తెలిసిపోతుంది. చాలా సందర్భాల్లో వారి ప్రొఫైల్ ఫొటో, పేరు కూడా కనిపిస్తాయి. వాట్సాప్‌కు ఇది ఎంతో ప్రయోజనకరమైన ఫీచర్ అయినప్పటికీ, ఇదే అతిపెద్ద బలహీనతగా మారింది. హ్యాకర్లు లేదా డేటా సేకరించే సంస్థలు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా కోట్లాది ఫోన్ నంబర్లను వరుసగా చెక్ చేసి, ఏవి వాట్సప్ యాక్టివ్‌గా ఉన్నాయో గుర్తించే ప్రమాదం ఉంది. ఇలా యూజర్ల ఫోన్ నంబర్లు, ఫొటోలు, పేర్లను పెద్ద మొత్తంలో సేకరించవచ్చు. ఇది వినియోగదారుల గోప్యతకు తీవ్ర భంగం కలిగిస్తుంది.
 
ఈ లోపాన్ని పరీక్షించేందుకు పరిశోధకులు కేవలం అరగంట వ్యవధిలోనే దాదాపు 3 కోట్ల అమెరికన్ ఫోన్ నంబర్ల వాట్సప్ ఖాతాలను గుర్తించగలిగారు. వెంటనే ఆ డేటాను డిలీట్ చేసి, వాట్సప్ మాతృసంస్థ మెటాను అప్రమత్తం చేశారు. దీనిపై స్పందించిన మెటా, పరిశోధకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ లోపంపై వారితో కలిసి అధ్యయనం చేస్తున్నామని, దాన్ని సరిదిద్దే మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొంది. అయితే, ఇప్పటివరకు ఈ లోపాన్ని ఎవరూ దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.