శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జులై 2020 (10:39 IST)

రిలయన్స్ జియోకు మహర్ధశ : క్వాల్‌కామ్ పెట్టుబడులు

దేశ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు కరోనా కష్టకాలం బాగా కలిసివచ్చినట్టుగా తెలుస్తోంది. కరోనా లాక్డౌన్ వేళ అనేక కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇతర కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, రిలయన్స్ జియో పరిస్థితి మరోలా వుంది. రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు అమితాసక్తిని చూపుతున్నాయి. తాజాగా క్వాల్‌కామ్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. 
 
నిజానికి గత ఏప్రిల్ 22 నుంచి కేవలం 12 వారాల వ్యవధిలో 11 కంపెనీల నుంచి రిలయన్స్ జియో పెట్టుబడులను ఆకర్షించింది. తద్వారా సుమారు 1.17 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను రాబట్టింది. ఇపుడు జియో ప్లాట్ ఫామ్స్‌లో 0.15 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.730 కోట్లను క్వాల్ కామ్ ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. 
 
ఈ విషయాన్ని స్వయంగా ఓ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించిన రిలయన్స్, దీంతో జియో ప్లాట్ ఫామ్స్‌లో పెట్టుబడులు రూ.1,18,318.45 కోట్లకు చేరుకున్నాయని ప్రకటించింది. కాగా, క్వాల్ కామ్, టెక్నాలజీ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఇండియాలోనూ క్వాల్ కామ్‌కు ఆఫీసులున్నాయి. ఇప్పటికే జియో ప్లాట్ ఫామ్స్‌లో ఫేస్ బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్ టన్, పీఐఎఫ్, ఇంటెల్ కాపిటల్ సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.