జియోపై మనసుపడిన ఇంటెల్ - రూ.1894 కోట్ల పెట్టుబడి
రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌పై మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఇంటెల్ మనసుపడింది. ఫలితంగా రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీ 1894.50 కోట్ల మేరకు పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఇంటెల్ ప్రకటించింది.
నిజానికి గత ఏప్రిల్ 22 నుంచి జూన్ 19 వరకు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, ముబాదలా, ఎల్ కాటర్‌టన్, ఏడీఐఏ, టీపీజీ వంటి సంస్థలు జియో ప్లాట్ ఫామ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇంటెల్ సంస్థ కూడా జియోలో భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టింది. మొత్తం 0.39 శాతం వాటాకు సమానమైన రూ.1,894.50 కోట్లను జియో ప్లాట్ ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో జియోలో మొత్తం రూ.1,17,588.45 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ రాగా, 25.09 శాతం వాటాను సంస్థ విక్రయించినట్లయింది.
మొత్తం 11 వారాల వ్యవధిలో జియో ప్లాట్ ఫామ్స్ విశ్వవ్యాప్తమైందని, భారత్‌లో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పిందని ఈ సందర్భంగా రిలయన్స్ వ్యాఖ్యానించింది.
ప్రపంచ విపణిలో ఇంత తక్కువకాలంలో ఈ స్థాయిలో పెట్టుబడులను స్వీకరించిన ఏకైక సంస్థ రిలయన్స్ కావడం గమనార్హం. అదికూడా కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలులో ఉన్న వేళ జియోకు భారీ ఎత్తున పెట్టుబడులు రావడం విశేషం.
ఈ డీల్‌పై ఇరు సంస్థలు ఆనందాన్ని వెలిబుచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఇంటెల్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ అన్నారు. కొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న నిజమైన పరిశ్రమ లీడర్ ఇంటెల్ అని అంబానీ వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా వినూత్న సంస్థలలో పెట్టుబడులు పెట్టడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ వంటి అంశాలపై దృష్టి సారించామని ఇంటెల్ క్యాపిటల్ తెలిపింది.
జియో కూడా వినూత్నంగా, వృద్ధి కోసం పెట్టుబడులు పెడుతోందని కంపెనీ ప్రకటించింది. డిజిటల్ సౌకర్యం, డేటా సేవలు, వ్యాపారాన్ని, సమాజాన్ని మెరుగ్గా మార్చగలవని తాము విశ్వసిస్తున్నామని ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్ వెండెల్ బ్రూక్స్ పేర్కొన్నారు.