గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (08:50 IST)

రిలయన్స్ జియోకు కలిసివచ్చిన కరోనా లాక్డౌన్ కష్టకాలం!

కరోనా లాక్డౌన్ కష్టాలు దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలకు బాగా కలిసివచ్చినట్టు తెలుస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో డిమార్ట్ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. ఫలితంగా సాదాసీదాగా ఉన్న డిమార్ట్ యజమాని సంపద ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. అలాగే, రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఫ్లాట్ ఫాం‌ విలువ కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఇందులోభాగంగా, ఈ సంస్థలో ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటీ, కేకేఆర్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టి వాటాలు దక్కించుకున్నాయి. తాజాగా, వరల్డ్ క్లాస్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ టీపీజీ కూడా జియో వైపు అడుగులు వేస్తోంది. 
 
మొత్తం రూ.4,546.8 కోట్ల పెట్టుబడితో జియోలో ప్రవేశించనుంది. ఈ మొత్తంతో టీపీజీకి జియో ప్లాట్ ఫాంలో 0.93 శాతం వాటా లభించనుంది. ఇక, టీపీజీ పెట్టుబడి తర్వాత జియో ప్లాట్ ఫాం విలువ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.1,02,432.15 కోట్లకు పెరిగింది.