నేడు రిలయన్స్ వార్షిక సమావేశం... భారీ వరాలు...
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రియలన్స్ 42వ వార్షిక సమావేశం సోమవారం జరుగనుంది. ఈ సమావేశంలో మరోమారు భారీగా వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా, రిలయన్స్ జియో సేవలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఇపుడు కొత్తగా జియో గిగాఫైబర్, గిగా టీవీ సర్వీస్, జియో ఫోన్3లను ఈ సమావేశంలో ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది.
గతంలో ఈ సమావేశాల్లో భాగంగానే జియో సిమ్‌ను, జియో ఫోన్‌ను ముఖేష్ విడుదల చేశారు. జియో సిమ్ సర్వీసులు టెలికాం రంగంలో పెను సంచలనాన్నే రేపాయి. అప్పటివరకూ వెలుగొందిన ఎయిర్‌టెల్, ఐడియా వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు జియో ప్రభావంతో కుదేలయ్యాయి.
అతి తక్కువ ధరలకే ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ప్లాన్స్‌ను జియో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో పెను సంచలనాన్ని సృష్టించిన జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏ ప్రకటన రాబోతోందా అని సామాన్య ప్రజలతో పాటు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.